టాలీవుడ్ లో మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేసింది. తనే వర్ష విశ్వనాథ్. నిన్నటి తరం హీరోయిన్ వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తె ఈమె. నటిగా వాణీ విశ్వనాథ్ కి ఎంతో గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతమైన సినిమాలలో నటించిన వాణీ విశ్వనాథ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతోంది. కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఆమె ‘జయ జానకి నాయక’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ వారసురాలు వర్ష విశ్వనాథ్ టాలీవుడ్ లో సంగీత ర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
కిట్టూ నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ వైజాగ్ లో జరుపుతున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ పెట్టాల్సి ఉంది. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో మూడు సినిమాలలో తెలుగులో ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’తో పాటు రాజీవ్ సినిమాలో నటిస్తోంది వర్ష. మరి పెద్దమ్మ వాణీ విశ్వనాథ్ లాగే వర్ష విశ్వనాథ్ కూడా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంటుందేమో చూద్దాం.