యాంకరింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ సుమ కనకాల. ఆమె మొదలుపెట్టిన ఈ యాంకరింగ్ ను ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు స్టార్ యాంకర్లుగా మారారు. ఆమె లేనిదే ఏ స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఉండదు.. ఆమె రానిదే స్టార్ హీరోల ఇంటర్వ్యూలు జరగవు. సుమ ఇంటర్వ్యూ చేసింది అంటే ఆ సినిమా హిట్ అన్నట్లే.. అలాంటి సుమ యాంకరింగ్ వదిలేసిందా..? అనేది ప్రస్తుతం అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ నేడు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో సుమ కు ఇదే ప్రశ్న ఎదురైంది. సినిమాల్లో బిజీ అవుతున్నారు.. యాంకరింగ్ కు ఫుల్ స్టాప్ పెడతారా..? అని అడుగగా.. “అయ్యోయ్యో అలాంటిదేమి లేదు.. నన్ను ఇక్కడివరకు నిలబెట్టింది యాంకరింగే.. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. నేను సినిమాలు చేసినా యాంకర్ గా కంటిన్యూ చేస్తూనే ఉంటా.. బుల్లితెర నాకు అన్నంపెట్టింది. దాన్ని ఎలా వదులుకుంటా” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సుమ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సుమ ఎక్కడ ఉన్నా ఆమెకు అండగా ఉంటామని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
