Site icon NTV Telugu

The Oscar : విల్ స్మిత్ ను వీడని ‘చెంపదెబ్బ’!

Will Smith

Will Smith

ఈ యేడాది ఆస్కార్ బరిలో ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్, అదే వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్ ను లాగి లెంపకాయ కొట్టిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు. ‘కింగ్ రిచర్డ్’ సినిమా విల్ స్మిత్ కు బెస్ట్ యాక్టర్ గా తొలి ఆస్కార్ ను అందించింది. ఆ వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్, విల్ భార్యపై సరదాగా చేసిన కామెంట్ కారణంగా ఈ ఎపిసోడ్ సాగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకు విల్ తన సోషల్ మీడియా వేదికలో ‘సారీ’ చెప్పాడు. తరువాత అకాడమీ స్మిత్ ను పదేళ్ళ పాటు ఆస్కార్ వేడుకలకు రాకుండా నిషేధించింది. అయితే ఈ శిక్ష సరిపోదని క్రిస్ రాక్ తల్లి రోజ్ రాక్ అంటున్నారు.

క్రిస్ రాక్ చెంపపై కొట్టిన విల్ స్మిత్ ను అకాడమీ కేవలం పదేళ్ళ పాటు బహిష్కరించడంతో రోజ్ రాక్ సంతృప్తి చెందలేదు. నిజానికి విల్ చేసిన పనికి అతనికి సంకెళ్ళు వేయాల్సిందేనని ఆమె అన్నారు. లేదా విల్ కు ప్రదానం చేసిన ఆస్కార్ ను తిరిగి తీసుకోవాలనీ ఆమె డిమాండ్ చేస్తున్నారు. తన సోషల్ మీడియాలో మరుసటి రోజునే విల్ స్మిత్ క్షమాపణ చెప్పిన విధానం కూడా సరిగా లేదని ఆమె తప్పు పట్టారు. అయితే ఆస్కార్ వేదికపైన విల్ స్మిత్ సభ్యత లేకుండా ప్రవర్తించినా, తన కొడుకు క్రిస్ రాక్ ఎంతో హుందాగా ఉన్నాడని, అందుకు తల్లిగా తాను గర్వపడుతున్నాననీ ఆమె అంటున్నారు. ఇదిలా ఉంటే క్రిస్ సోదరుడు కెన్నీ రాక్ కూడా విల్ స్మిత్ ‘సారీ’ చెప్పిన విధానంలో నిజాయితీయే లేదని అన్నాడు. విల్ క్షమాపణ చెప్పిన తీరులోని లోపాలను ఇంకా ఎందరు ఎత్తి చూపిస్తారో! ఇంకా ఎన్నాళ్ళు ఈ చెంపదెబ్బ విల్ ను వెంటాడుతుందో చూడాలి.

Exit mobile version