NTV Telugu Site icon

Will Smith : అకాడమీ నుండి తప్పుకున్న విల్ స్మిత్

Will Smith

Will Smith

ఈ సారి జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్యంగా విల్ స్మిత్, వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై చేయిచేసుకోవడం పెద్ద దుమారం రేపింది. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ బోడిగుండుపై రాక్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన స్మిత్ అతనిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అకాడమీ క్రమశిక్షణ కమిటీ ఇటీవల సమావేశమయింది. ఆ కమిటీ నిర్ణయం రాకమునుపే విల్ స్మిత్ తాను అకాడమీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. దానిని అకాడమీ సైతం ఆమోదించింది.

ఈ సందర్భంగా స్మిత్ తన చర్యలను తానే ఖండించుకున్నారు. తాను అలా ప్రవర్తించి ఉండకూడదని, ఇది అకాడమీ నియమనిబంధనలకు, గౌరవానికి, హుందా తనానికి భంగం కలిగించినట్టేనని అంగీకరించారు. తన చర్య వల్ల ఎంతోమంది ఆస్కార్ విజేతలు ఆ వేడుకలో ఆనందం పంచుకోలేక పోయారని, వారికి ఇబ్బంది కలిగించినందుకు క్షమించమని వేడుకున్నారు. తన ప్రవర్తన కారణంగా అకాడమీ నమ్మకాన్ని వమ్ము చేశానని, అది తనకెంతో బాధ కలిగిస్తోందని ఇకపై ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాననీ విల్ పేర్కొన్నారు. చిత్రరంగంలోని సృజనకు, కళాత్మకతకు అకాడమీ పెద్ద పీట వేస్తోందని, తన కారణంగా గౌరవప్రదమైన అకాడమీకి ఏలాంటి ఇబ్బందులు కలగబోవని విల్ హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హోస్ట్ గా వ్యవహరించిన క్రిస్ రాక్ ను అతనిపై జరిగిన దాడి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా అని పోలీసులు అడిగారు. అందుకు రాక్ నిరాకరించడం గమనార్హం!