‘పెద్లల సభ’ అంటే రాజ్యసభ, దానినే ఎగువ సభ అనీ అంటారు. ఈ సభలో మన సినీజనం అనే శీర్షిక చూడగానే, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఓ నటుడు రాజ్యసభకు వెళ్ళనున్నారని వినిపిస్తోన్న అంశం గుర్తుకు రాకమానదు. ఇంతకూ పెద్దల సభలో మన సినీజనం ఎవరెవరు ఎలా అడుగు పెట్టారన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.
యన్టీఆర్ తరువాతే…!
‘భారత రాజకీయాలందు తెలుగు రాజకీయాలే వేరయా’ అన్నట్టుగా మన రాజకీయం సాగుతూ ఉంటుంది. తెలుగు నాట జనాల్లో రాజకీయ పరిజ్ఞానం అన్నది హెచ్చింది మహానటుడు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశం తరువాత అనే చెప్పాలి. అంతకు ముందు తెలుగునేలపై కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం దాదాపు మూడున్నర దశాబ్దాలు సాగింది. అందువల్ల తెలుగు రాజకీయాల్లో వైవిధ్యం కనిపించలేదు. ఆ కారణంగా అప్పట్లో భారతరాజకీయాల్లో తమిళ రాజకీయాలు విలక్షణ పాత్ర పోషిస్తూ వచ్చాయి. యన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత నుంచే తెలుగునాట రాజకీయాల్లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు ఎవరినైనా బర్తరఫ్ చేస్తే మళ్ళీ ఎన్నికల దాకా ఆగాల్సి వచ్చేది. అలాంటి ధోరణికి చరమగీతం పాడి, ప్రజాబలం ఉన్నవాళ్ళు తప్పకుండా బర్తరఫ్ ను ఎదుర్కోవచ్చునని నిరూపించింది రామారావే! ఆపై తెలుగునాట రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు సాగుతూ కేంద్ర రాజకీయాల్లోనూ మనవాళ్ళు కీలక పాత్రలు పోషించే స్థాయి లభించింది. అంతకుముందు తెలుగు రాజకీయ నాయకులకు ఢిల్లీలో పరపతి ఉన్నా, అది వారి వారి పరిచయాలు, పరిజ్ఞానాన్ని బట్టి మాత్రమే ఉండేది. కానీ, రామారావు రాజకీయ ప్రవేశం చేసిన తరువాతనే కాంగ్రెస్ నాయకులకు కూడా ఉత్తరాదిన పరపతి పెరిగిందని సదరు పార్టీ నాయకులే ఒకప్పుడు చెప్పుకున్నారు. ఇక దేశ రాజకీయాలను మలుపు తిప్పడంలోనూ యన్టీఆర్ తనదైన పాత్ర పోషించారు. అలాగే తెలుగునేల నుండి పెద్దల సభలో సినీజనం అడుగు పెట్టడానికీ రామారావే శ్రీకారం చుట్టారు.
అక్కడా ‘అన్న’ మార్కు!
ఆంధ్రప్రదేశ్ నుండి పెద్దల సభగా పేరొందిన రాజ్యసభకు సినిమా జనాన్ని ఎంపిక చేయడమన్నది కూడా యన్టీఆర్ తోనే మొదలయిందని చెప్పవచ్చు. యన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో ఎంతోమంది సినీజనం, “అయ్యో… పాపం…” అని సానుభూతి చూపించారు. యన్టీఆర్ కు రాజకీయాలు తెలియవు. కాబట్టి, ఆయన రాణించలేరు, విజయం సాధించలేరనే ఆ నాటి సినీజనాల్లో అధిక సంఖ్యాకుల అభిప్రాయం. అయితే యన్టీఆర్ సహ నటులు రావు గోపాలరావు మాత్రం తప్పకుండా రామారావు విజయం సాధిస్తారు అనే విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు, 1982లో తెలుగుదేశం విజయం కోసం ప్రచారం కూడా చేశారాయన. ఆ తరువాత సైతం యన్టీఆర్ బర్తరఫ్ అయినా, మళ్ళీ అధికారం చేపట్టినా తెలుగుదేశం నీడనే ఉన్నారు రావు గోపాలరావు. అందువల్ల 1986లో రావు గోపాలరావును యన్టీఆర్ రాజ్యసభకు ఎన్నిక చేసి పంపారు. తెలుగునాట ఓ నటుడు పెద్దల సభకు ఎన్నిక కావడం అదే తొలిసారి!
తరువాత కూడా రాజ్యసభకు సినిమా వారిని ఎంపిక చేయడంలో తెలుగుదేశమే ముందుకు సాగింది. 1995లో మోహన్ బాబును రాజ్యసభకు పంపింది. ఆ తరువాత 1996లో జయప్రదను ఎంపిక చేసింది. ఆపై 2008లో హరికృష్ణను రాజస్యభ సభ్యునిగా చేసిందీ తెలుగుదేశం పార్టీనే కావడం గమనార్హం! ఇక కళాకారుల కోటాలో డాక్టర్ సి.నారాయణ రెడ్డిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడానికి కారణం కూడా 1997లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీయే అని చెప్పక తప్పదు!
రాజకీయాల్లో కాకలు తీరిన కాంగ్రెస్ పార్టీ సైతం అప్పటి దాకా కళాకారుల కోటాలో ఉత్తరాదిన కొంతమంది సినిమా రంగానికి చెందిన వారిని రాజ్యసభలో కూర్చోబెట్టింది. అంతే తప్ప తెలుగునేలపై మాత్రం యన్టీఆర్ తరువాతే తామూ రాజ్యసభకు సినీజనాలను ఎంపిక చేయడం మొదలు పెట్టింది. ఆ తీరున 2000లో తొలిసారి నటదర్శకులు దాసరి నారాయణరావును రాజ్యసభకు పంపింది. ఆయన ఆరు సంవత్సరాల టెర్మ్ పూర్తయ్యాక 2006లో మళ్ళీ దాసరిని రాజ్యసభ సభ్యునిగా నిలిపింది కాంగ్రెస్ పార్టీ. అలా వరుసగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన తెలుగు సినీజీవిగా దాసరి నిలిచారు. 2004లో దాసరి బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. 2009 ఎన్నికల్లో తన ‘ప్రజారాజ్యం’ పార్టీ తరపున 18 సీట్లు సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ళ తరువాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అప్పుడు 2012లో చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా చేసింది. అదే సమయంలో కేంద్ర టూరిజం శాఖకు ఆయన మంత్రిగా పనిచేశారు.
ఆ మధ్య చిరంజీవి ఒక్కరూ వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా మరోమారు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం రానుందని వినిపించింది. అయితే ఆ తరువాత దానిని చిరంజీవి ఖండించారు. ఇక తాజాగా చిరంజీవి తన సహనటులు మహేశ్ బాబు, ప్రభాస్ తో పాటు రాజమౌళి, కొరటాల శివతో కలసి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. అదే సమయంలో అక్కడకు వైసీపీకి మద్దతు పలికిన ఆలీ, నటదర్శకుడు ఆర్.నారాయణ మూర్తి, నటరచయిత పోసాని కృష్ణమురళి కూడా విచ్చేసి ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు ముగిశాక, ఆలీకి మళ్ళీ వారం జగన్ కలిసే అవకాశం ఉందని తెలిసింది. దాంతో ఆలీని వైసీపీ రాజ్యసభకు పంపనున్నట్టు విశేషంగా వినిపిస్తోంది. మరి అది ఎప్పుడు ఎలా కార్యరూపం దాల్చనుందో చూడాలి.
ఇంతకు ముందు రాజ్యసభలో మన తెలుగు సినీజనం:
రావు గోపాలరావు (1986 -92)
మోహన్ బాబు (1995 – 2000) (ఓ సభ్యుని మరణంతో ఏర్పడ్డ ఖాళీలో మోహన్ బాబు చేరారు)
జయప్రద (1996-2002)
హరికృష్ణ (2008 -2014)
దాసరి నారాయణరావు (2000-06, 2006-12) (రెండు సార్లు వరుసగా రాజ్యసభకు ఎంపికైన సినీ పర్సనాలిటీ)
చిరంజీవి (2012 – 2018)
డాక్టర్ సి.నారాయణ రెడ్డి (1997-2003) (సినారె ఒక్కరే కళాకారుల కోటాలో రాష్ట్రపతిచే నామినేట్ అయ్యారు)
కొసమెరుపు: ఇప్పటి దాకా తెలుగు నేల నుండి రాజ్యసభకు ఎంపికైన వారిలో ఒకే ఒక్క జయప్రద మహిళా సభ్యురాలు. మరో విశేషమేమిటంటే, ఆమె తప్ప ఇతరులను ఎంపిక చేసినవారికి, వారి ప్రభుత్వాలకు పదవీచ్యుతి కలగడం గమనార్హం! ఎలాగంటే 1986లో రాజ్యసభుకు రావు గోపాలరావును పంపిన తెలుగుదేశం అధినేత యన్టీఆర్ 1989లో అధికారం కోల్పోయారు. 1995లో ఆయనే మరోమారు అధికారం చేపట్టాక, మోహన్ బాబును రాజ్యసభకు ఎన్నిక చేశారు. 1995 ఆగస్టు సంక్షోభంలో ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ఇక హరికృష్ణను 2008లో చంద్రబాబు రాజ్యసభకు తెలుగుదేశం తరపున పంపారు. ఆ తరువాత యేడాది జరిగిన 2009 ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించలేకపోయారు.
2000లో దాసరిని రాజ్యసభకు ఎంపిక చేసిన సమయంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్.సత్యనారాయణ రావు. 2004 తరువాత ఆయన ఆ పదవిలో లేరు. 2006లో దాసరిని మరోమారు రాజ్యసభకు ఎంపిక చేశారు. అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న కె.కేశవరావు దాసరి టర్మ్ పూర్తి కాకముందే ఆ పదవి నుండి తొలగాల్సి వచ్చింది. ఇక 2012లో చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసినప్పుడు బొత్స సత్యనారాయణ అధ్యక్షులు. ఆ తరువాత ఆయన ఓటమి పాలయ్యారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పరాజయాన్నిచవిచూసింది.
మరి తాజాగా వైసీపీ ఎవరైనా సినిమాకు చెందిన వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేసి పంపితే, కొత్త చరిత్ర సృష్టిస్తుందేమో చూద్దాం.