Ori Devuda: రెండేళ్ళ క్రితం తమిళంలో విడుదలై, చక్కని విజయాన్ని సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, ఇక్కడ విశ్వక్ సేన్ చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన గాడ్ క్యారెక్టర్‌ను విక్టరీ వెంకటేష్ పోషించారు. ఈ సినిమాలో హీరోకు తన మావగారి సిరమిక్స్ కంపెనీలో పనిచేయడం కంటే.. నటన మీదనే మక్కువ ఎక్కువ. యాక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అందులో అతనికి స్కూల్ మేట్ మీరా సాయం చేస్తుంది. ఆమె గౌతమ్ వాసుదేవ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేస్తుంటుంది. ఒకసారి హీరోనూ ఆయన దగ్గరకు ఆడిషన్ కోసం తీసుకెళుతుంది.
Read Also: Kantara: ఐఎండీబీ రేటింగ్స్‌లో ‘కాంతార’ సంచలనం
అయితే.. ‘ఓ మై కడవులే’లో గౌతమ్ వాసుదేవ మీనన్ పోషించిన పాత్రను తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పోషించారు. ఆయన దగ్గరే సెకండ్ హీరోయిన్ వర్క్ చేస్తుంటుంది. దర్శకుడు పూరి ముందు హీరో ఆడిషన్ ఇచ్చి, భేష్ అనిపించుకుంటాడట. పూరి జగన్నాథ్ తెర మీద కనిపించడం అనేది కొత్తేమీ కాదు. గతంలో కొన్ని సినిమాలలో ఆయన దర్శకుడిగానే కనిపించారు. అయితే ఈ నెల 5న విడుదలైన ‘గాడ్ ఫాదర్’లో మాత్రం యూట్యూబర్‌గా పూరీ జగన్నాథ్ చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఆ మూవీకి పిల్లర్ లాంటి ఆరేడు క్యారెక్టర్లలో ఆయనదీ ఒకటి. ఆ మూవీ వెనుకే ‘ఓరి దేవుడా’ కూడా విడుదల కావడంతో పూరిలోని నటుడిని వెంటవెంటనే చూసే ఛాన్స్ తెలుగు ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ రెండు సినిమాల్లో పూరీ జగన్నాథ్ పోషించిన పాత్రలను చూసిన తెలుగు దర్శకులు ఆయనకు మరిన్ని ఆఫర్స్ ఇస్తారనడంలో సందేహం లేదు.