NTV Telugu Site icon

Akash Puri : ఆకాశ్ పూరిని ఆదుకునేది ఎవరు!?

Akash Puri

Akash Puri

ఆకాశ్ పూరి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ తనయుడు. పూరి ఫుల్ ఫామ్ లో ఉన్నపుడు వరుసగా బాలనటుడుగా ‘చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిజినెస్ మేన్’ సినిమాల్లో నటించాడు. తండ్రి సినిమాలే కాదు ‘ద లోటస్ పాండ్, ధోని, గబ్బర్ సింగ్’ వంటి ఇతర దర్శకుల సినిమాల్లో సైతం చైల్డ్ అర్టిస్ట్ గా మెరిశాడు. ఆ తర్వాత లేలేత వయసులోనే మరాఠీ రీమేక్ ‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో మైలేజ్ తెచ్చిపెట్టలేకపోయింది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో తండ్రి పూరినే రంగంలోకి దిగి ఆకాశ్ తో ‘మెహబూబా’ అనే సినిమా తీశాడు. ఇది సైతం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తర్వాత తను కథ మాత్రమే ఇచ్చిన అనిల్ పాడూరి అనే దర్శకుడుతో ‘రొమాంటిక్’ అనే సినిమా తీయించాడు పూరి జగన్నాథ్. ఆ సినిమా సైతం ఆకాశ్ కి నిరాశనే కలిగించింది.

ఇలా లాభం లేదనుకున్నాడో ఏమో తండ్రి నీడ నుంచి పూర్తిగా బయటకు జరిగి ‘దళం, జార్జిరెడ్డి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘చోర్ బజార్’ అనే సినిమా చేశాడు ఆకాశ్ పూరి. గెహనా సిప్పీ నాయిక. కరోనా పాండమిక్ దాటుకుని ఈ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. నటుడుగా ఆకాశ్ పూరిలో మెచ్యూరిటీ కనిపించింది కానీ తను కోరుకున్న విజయాన్ని ఈ సినిమా కట్టబెట్టలేకపోయింది. ఇప్పుడు ఆకాశ్ చేతిలో కొత్త కమిట్ మెంట్స్ కూడా ఏమీ లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘చోర్ బజార్’ ఫలితం ఆకాశ్ ని బాగా కృంగదీస్తుందనే చెప్పాలి. అయితే తన తండ్రి పూరి సైతం కెరీర్ లో ఇలాంటి ఒడిదుడుకుల్ని ఫేస్ చేసిన వాడే. ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు వరుస పరాజయాలు ఎదుర్కొని అన్నీ పోగొట్టుకున్నాడు. అయితే ఒక్కసారిగా జూలు విదిల్చి ‘ఇస్మార్ట్ శంకర్’ తో స్మార్ట్ సక్సెస్ చూసి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ తీస్తున్నాడు. సరైన స్క్రిప్ట్ పడితే ఆకాశ్ కూడా విజయం సాధించే అవకాశం ఉంది. నటనలో మెచ్యూరిటీ చూపించనట్లే కథ ఎంపికలో కూడా తెలివిగా వ్యవహరించి సరైన కథతో ఆడియన్స్ మెప్పుపొందాలి. మరి ఆ కథ తండ్రి పూరి ఇస్తాడా? లేక బయటి వ్యక్తుల ద్వారా లభిస్తుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. బెస్టాప్ లక్ ఆకాశ్.