శర్వానంద్… మంచి నటుడే… కానీ హీరోగా సరైన హిట్ పడటం లేదు. 2017లో వచ్చిన ‘శతమానం భవతి’ తర్వాత మరో సాలీడ్ హిట్ శర్వా ఖాతాలో లేదు. ‘మహానుభావుడు’ పర్వాలేదనిపించినా ‘రాధ, పడిపడిలేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం’ వంటి సినిమాలు శర్వానంద్ మార్కెట్ ను భారీ స్థాయిలో దెబ్బ తీశాయి. దాంతో నటుడుగా శర్వానంద్ సామర్ధ్యం కంటే ప్యాడింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టవలసిన స్థితి ఏర్పడింది. దాంతో శర్వా తాజా చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ పూర్తి స్థాయిలో భారీ ప్యాడింగ్ తో రూపొంది విడుదలకు సిద్ధం అయింది.
నిజానికి ఈ సినిమాను వెంకటేశ్, నిత్యామీనన్ తో తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు కిశోర్ తిరుమల. ఏమైందో ఏమో కానీ కొంత కాలం పెండింగ్ లో పడిన ఈ ప్రాజెక్ట్ చివరకు శర్వానంద్ తో మొదలైంది. లక్కీగా ఫుల్ ఫామ్ లో ఉన్న రశ్మిక హీరోయిన్ గా ఎంపిక కావటంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది.
కిశోర్ తిరుమలకు ‘నేను శైలజ’తో దర్శకుడుగా గుర్తింపు వచ్చింది. అంతకు ముందు తమిళంలో ఓ సినిమా, తెలుగులో సెకండ్ హ్యాండ్ సినిమా డైరెక్ట్ చేసినా తగిన గుర్తింపు దక్కలేదు. ‘నేను శైలజ’ హిట్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన కిశోర్ ఆ తర్వాత ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’ వంటి సినిమాలు చేశాడు. అవేవీ ‘నేను శైలజ’లా పేరు తెచ్చిపెట్టలేక పోయాయి. ఇప్పుడు శర్వానంద్ తో పాటు కిశోర్ ఆశలు కూడా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ పైనే ఉన్నాయి. ఈ సినిమాకు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఇంతకు ముందు శర్వానంద్ తో ‘పడిపడి లేచె మనసు’ సినిమాను ప్రసాద్ చుక్కపల్లితో కలసి నిర్మించారు. ఆ సినిమాలో భారీ నష్టాలు వచ్చినా ధైర్యంగా ఇప్పుడు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాను శర్వానంద్ మార్కెట్ కి అతీతంగా భారీ ఖర్చుతో నిర్మించారు.
మార్చి 4న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి శర్వానంద్ కి ఈ సినిమా ద్వారా హిట్ ఇచ్చేది ఎవరు!? కిశోర్ తిరుమల కథనా? దేవిశ్రీ ప్రసాద్ సంగీతమా!? రశ్మిక మందన్న లక్ నా? లేక సుధాకర్ చెరుకూరి తెంపరితనమా!? ఏది శర్వానంద్ ని మార్కెట్ లో హీరోగా నిలబెడతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. శర్వాకి కలసి వచ్చే అంశం ఏమిటో మార్చి 4న తేలనుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.
