Site icon NTV Telugu

Alia Bhatt : ఆలియా భట్ సినిమాల పరిస్థితి ఏంటి!?

Alia

Alia

రణ్ బీర్ కపూర్ ని పెళ్ళాడిన ఆలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రకటించిన వెంటనే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రచారంలో ఆలియా పాల్గొనవలసి ఉంది. ఇది కాకుండా రెడ్ చిల్లీస్ పతాకంపై షారూఖ్ భార్య గౌరీఖాన్ తో కలసి ఆలియా నిర్మిస్తున్న ‘డార్లింగ్స్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందు థియేటర్ రిలీజ్ అనుకున్నప్పటికీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలకు రెడీ అవుతోంది.

ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘రాకీ అవుర్ రాణి కి ప్రేమ్ కహాని’ షూటింగ్ పూర్తి కాలేదు. ఇందులో రణ్‌ వీర్ సింగ్ కథానాయకుడు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 48 సంవత్సరాల తర్వాత ధర్మేంద్ర, జయాబచ్చన్ కలసి నటిస్తున్నారు. అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా ఆలీఖాన్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. ‘గల్లీబోయ్’ తర్వాత రణ్ వీర్, ఆలియా కలసి చేస్తున్న సినిమా ఇది. 2021 ఆగస్ట్ లో షూటింగ్ మొదలైంది. మాస్కోలో రణ్ వీర్, ఆలియాపై పాటను చిత్రీకరించారు. మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇంకా షూటింగ్ చాలా వరకు మిగిలి ఉంది. ఇప్పుడు ఆలియా గర్భవతి అయిన నేపథ్యంలో ఈ సినిమాను ఎంత త్వరగా పూర్తి చేస్తారన్నది తేలాల్సి ఉంది. ఇది కాకుండా ఆలియా భట్ కమిట్ అయిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ కి సంబంధించి ఆలీయా షూటింగ్ మొదలు కాలేదు. గాల్ గాడట్, జెమీ డోర్నన్, సోఫీ వంటి తారల కాంబినేషన్ లో ఆలియా వర్క్ ముడిపడి ఉంది. సో ఇప్పడు ఈ సినిమా నుంచి ఆలియా తప్పుకోక తప్పదు. తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన ఆలియా ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలో నటించనుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇదే కాకుండా మరి కొన్ని సినిమాల విషయంలోనూ ఆలియా భట్ పేరు వినిపించింది. వీటిలో ఏది నిర్ధారణ కాలేదనుకోండి. ఇప్పుడు ఆలియా ప్రెగ్నెంట్ అయినందున సమీప భవిష్యత్ లో తెలుగులో నటించే అవకాశం లేదన్నది స్పష్టం. మరి బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా సినిమాల్లో నటిస్తుందా? అలా అయితే ఆలియా కమిట్ కానున్న సినిమా ఏది అన్నది చూడాలి.

Exit mobile version