Tollywood:నటశేఖర కృష్ణ మరణంతో ఆ నాటి ‘నటపంచకం’గా పేరొందిన నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అందరూ ఈ లోకాన్ని వీడినట్టయింది. ఆ ఐదుగురు నటులు తెలుగు చిత్రసీమకు చేసిన సేవలను ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఎవరి కెరీర్ ఎంత కాలం సాగింది. ఎవరు ఎన్ని చిత్రాలలో నటించారు. ఎలా చిత్రసీమకు సేవలు అందించారు అన్నదానిపైనా చర్చ సాగుతోంది. ఈ ఐదుగురు స్టార్స్ లో అందరూ నూటతొంభైకి పైగా చిత్రాల్లో నటించినవారే కావడం విశేషం!
నటరత్న యన్టీఆర్ 1949 ‘మనదేశం’ చిత్రంతో నటునిగా పరిచయమై, 1962 నాటికి వంద చిత్రాలు పూర్తి చేసుకున్నారు. దేశంలో తొలిసారి వంద చిత్రాల్లో ప్రధానభూమిక పోషించిన నటునిగా నటరత్న చరిత్ర సృష్టించారు. ఆయన నూరవ చిత్రంగా ‘గుండమ్మ కథ’ 1962లో విడుదలయింది. ఆ తరువాత కేవలం ఎనిమిది సంవత్సరాలకే అంటే 1970లో మరో వంద చిత్రాలు పూర్తి చేసి, తన 200వ చిత్రంగా ‘కోడలు దిద్దిన కాపురం’ను జనం ముందు నిలిపారు. ఇక యన్టీఆర్ 300వ సినిమాగా ఆయన చివరగా నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ విడుదలయింది. ఇలా అన్నిటా యన్టీఆర్ తెలుగు చిత్రసీమలో ప్రధాన మైలురాళ్ళను ముందుగా దాటడం గమనార్హం! 1982 తరువాత యన్టీఆర్ రాజకీయ రంగంలో అడుగుపెట్టడంతో ఆయన నటనా పర్వంలో గ్యాప్ బాగా వచ్చింది. అందువల్ల 300 చిత్రాల మైలురాయికి దాదాపు 23 సంవత్సరాలు పట్టినట్టయింది.
నటసమ్రాట్ ఏయన్నార్ 1941లో ‘ధర్మపత్ని’ చిత్రం ద్వారా పరిచయం అయినా, తరువాత 1944లో రూపొందిన ‘సీతారామజననం’తోనే ఊపందుకున్నారు. తమిళంలో రూపొందిన ‘గుండమ్మకథ’ – ‘మణిదన్ మారవిల్లై’తో ఏయన్నార్ నూరు చిత్రాల మైలురాయి దాటారు. ఆ సినిమా కూడా 1962లోనే వెలుగు చూసింది. అంటే దాదాపు 19 ఏళ్ళు పట్టిందన్న మాట. ఆ తరువాత 200వ చిత్రంగా ఆయన నటించిన ‘మేఘసందేశం’ 1982లో ప్రేక్షకులను పలకరించింది. ఈ మైలు రాయిని చేరుకోవడానికీ దాదాపు 20 సంవత్సరాలు కావలసి వచ్చింది. ఆ పై మరో 50కి పైగా చిత్రాలలో ఆయన నటించారు.
నటశేఖర కృష్ణ విషయానికి వస్తే అంతకు ముందు 1961లోనే ‘కులగోత్రాలు’లో తెరపై కనిపించినా, 1965లో రూపొందిన ‘తేనెమనసులు’ తరువాతే ఆయన కెరీర్ స్పీడుగా సాగింది. ఆయన తొలి 100 చిత్రాల మైలురాయి చేరుకోవడానికి పదేళ్ళు పట్టింది. ఆ తరువాత మరింత స్పీడుగా సాగి యన్టీఆర్ లాగే తరువాతి వంద చిత్రాలను కేవలం 8 సంవత్సరాలలో పూర్తి చేశారు. ఆయన 200వ చిత్రంగా ‘ఈనాడు’ 1982లో ప్రేక్షకులను పలకరించింది. ఆ పై ఆయన 300వ చిత్రంగా తెరకెక్కిన ‘తెలుగు వీర లేవరా’ చేరుకోవడానికి 13 ఏళ్ళు పట్టింది. అంటే 31 ఏళ్ళ సమయంలో కృష్ణ 300 చిత్రాల మైలురాయి దాటారు. ఆపై మరో నలభై పై చిలుకు చిత్రాలలో కృష్ణ నటించారు.
నటభూషణ శోభన్ బాబు 1959లో ‘దైవబలం’ చిత్రంతో జనం ముందు నిలచి అప్పటి నుంచీ ఏకధాటిగా నటిస్తూనే వచ్చారు. ఆయన 100వ చిత్రంగా ‘ఖైదీ బాబాయ్’ 1974లో ప్రేక్షకుల ముందు నిలచింది. అంటే శోభన్ బాబు వంద చిత్రాల మైలురాయి దాటడానికి దాదాపు 16 ఏళ్ళు పట్టిందన్నమాట. ఆ తరువాత ఆయన ఆచి తూచి అడుగేస్తూ నిదానంగా సాగినా, 1986లో విడుదలైన తన ‘ధర్మపీఠం దద్దరిల్లింది’తో 200 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. అంటే రెండో వంద చిత్రాలకు 12 ఏళ్ళు తీసుకున్నారన్న మాట! ఆ తరువాత మరో పాతిక పైగా చిత్రాలలో శోభన్ నటించారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు 1966లో ‘చిలకా-గోరింకా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తరువాత చిత్రసీమలో రాణించడానికి చిన్నాచితకా వేషాలు వేస్తూ సాగారు. అలా అయినా, ఆయన వందో చిత్రంగా విడుదలైన ‘శివమెత్తిన సత్యం’ 1980లో విడుదలయింది. అంటే దాదాపు 14 ఏళ్ళలో కృష్ణంరాజు వంద చిత్రాలు పూర్తి చేశారన్న మాట. ఆ పై మరో 90 పైచిలుకు చిత్రాలలో కృష్ణంరాజు నటించారు.
ఈ ఐదుగురు స్టార్స్ కంటిన్యూగా సాగిన కాలాన్నే పరిగణనలోకి తీసుకుంటే, యన్టీఆర్ 1949 నుండి 1982 వరకు అంటే 34 ఏళ్ళ సమయంలో 297 చిత్రాలలో నటించారు. అంటే ఆయన సగటు 8.7 ఉంది. ఇక ఏయన్నార్ విషయానికి వస్తే ఆయన తన కెరీర్ లో 1975 ఓ సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. అంటే అప్పటికి విడుదలైన చిత్రాల సంఖ్యనే తీసుకుంటే 165 చిత్రాలలో నటించారు. అంటే ఆయన సగటు 32 ఏళ్ళలో 5.1 అన్నమాట! ఇక కృష్ణ విషయానికి వస్తే ఆయన తన కెరీర్ లో 1965 నుండి 2009 వరకు ఏకధాటిగా నటించారు. అంటే 45 ఏళ్ళు నటిస్తూనే ఉన్నారు. ఆయన సగటు 7.6. కాగా, శోభన్ బాబు తన కెరీర్ లో 1959 నుండి 1996 దాకా నటించారు. 38 ఏళ్ళలో శోభన్ సగటు 6 గా నిలచింది. కృష్ణంరాజు 1966 నుండి 1987 దాకా నిరాటంకంగా సాగింది. తరువాత గ్యాప్స్ వచ్చాయి. అంటే 22 ఏళ్ళలో వరుసగా నటించిన చిత్రాలనే బేరీజు వేస్తే ఆయన సగటు 6.7 వస్తుంది. ఇలా ఎంతగానో తెలుగు చిత్రసీమకు తమదైన రీతిలో సేవలు అందించిన ఈ ఐదుగురు నటులు లేరన్న విషయం బాధ కలిగించేదే అయినా, వారి చిత్రాలు బుల్లితెరపైనో, మరో రూపంలోనో జనాన్ని అలరిస్తూనే ఉన్నాయి. నవతరం కథానాయకులు ఈ స్టార్స్ ను స్ఫూర్తిగా తీసుకొని తమ నటనకు మెరుగులు దిద్దుకుంటే ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించ వచ్చు.
