Site icon NTV Telugu

Deepavali Cinemas: టాలీవుడ్‌లో కోలీవుడ్ చిత్రాల మధ్యే వార్..!!

Kollywood

Kollywood

Deepavali Cinemas: ఈ ఏడాది దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల చివరి వారంలో తమిళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి. ధనుష్ నటించగా, సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ‘నేనే వస్తున్నా’ సెప్టెంబర్ 29న విడుదలైతే, ఆ మర్నాడే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ రిలీజైంది. దాదాపు ఇలాంటి పరిస్థితే ఈ నెల మూడోవారంలో దీపావళి కానుకగా విడుదల కాబోతున్న సినిమాల విషయంలోనూ జరుగబోతోంది.

‘సర్దార్’ వర్సెస్ ‘ప్రిన్స్’
తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. ‘అభిమన్యుడు’ ఫేమ్ పి. ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రాశిఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 21న విడుదల అవుతోంది. దీన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే రోజున మరో తమిళ సినిమా ‘ప్రిన్స్’ కూడా రిలీజ్ అవుతోంది. శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ‘ప్రిన్స్’ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె. వి. తెరకెక్కించాడు. విశేషం ఏమంటే.. నాగార్జునతో ఇటీవల ‘ది ఘోస్ట్’ మూవీ నిర్మించిన సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ తో పాటు సురేశ్ బాబు దీన్ని నిర్మించాడు.

మరో చిత్రం ఏంటంటే.. ఈ రెండు సినిమాలతో పాటు మరో తమిళ రీమేక్ మూవీ కూడా తెలుగువారి ముందుకు 21వ తేదీనే వస్తోంది. ‘ఓ మై కడవులే’ అనే తమిళ సినిమాను తెలుగులో విశ్వక్ సేన్‌తో ‘ఓరి దేవుడా’ పేరుతో ప్రసాద్ వి పొట్లూరి, ‘దిల్’ రాజు సంయుక్తంగా నిర్మించారు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ కీలకమైన దేవుడి పాత్రను పోషించారు. మాతృకకు దర్శకత్వం వహించిన అశ్వ‌త్ మారిముత్తునే తెలుగు రీమేక్ కూ డైరెక్షన్ చేశారు. సో… ఆ రకంగా ఈ మూడు తమిళ కంటెంట్ మూవీస్ తెలుగులో దీపావళికి జనం ముందుకు వస్తున్నాయి. దీంతో పాటే అదే రోజున మంచు విష్ణు నటించి, నిర్మించిన ‘జిన్నా’ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లోనూ, హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ఆడమ్’ డబ్బింగ్ వర్షన్ విడుదల కాబోతున్నాయి. ఇక 25వ తేదీ దీపావళి పండగ రోజున అక్షయ్ కుమార్ హిందీ చిత్రం ‘రామ్ సేతు’ తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ అవుతోంది. ఇందులో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. ఆ రకంగా ఇది కూడా తెలుగు వారిలో ఆసక్తిని రేకెత్తించే ప్రాజెక్టే. మరి వీటిల్లో ఏ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారో చూడాలి.

Exit mobile version