చెన్నైలో స్థిరపడిన తెలుగు కుర్రాడు విశాల్.. ఈ విషయం అందరికి తెల్సిందే. స్టార్ హీరోగా విశాల్ కు కోలీవుడ్ లో ఎంత పేరు ఉందో టాలీవుడ్ లో కూడా అంతే పేరు ఉంది. అక్కడ రిలీజ్ అయిన విశాల్ సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇటీవలే ఎనిమీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విశాల్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే సినిమాలతో పాటు విశాల్ రాజకీయాల్లో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెల్సిందే. తమిళ్ నడిగర్ సంఘానికి విశాల్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక దీంతో పాటు సినీ కార్మికులకు ఎటువంటి కష్టం వచ్చినా విశాల్ ముందు ఉండి ప్రభుత్వంతో మాట్లాడి సాల్వ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి.
ఇక గత కొన్ని రోజుల నుంచి విశాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబుకు పోటీగా విశాల్ రంగంలోకి దిగుతున్నాడని, ఇందుకోసం త్వరలోనే విశాల్ ఏపీలో అడుగుపెడుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక వార్తలపై విశాల్ తాజాగా స్పందించాడు. ” నేను ఆంధ్రప్రదేశ్ కుప్పం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తలు విన్నాను. నేను వాటిని ఖండిస్తున్నాను. వీటికి నేను దూరంగా ఉనాన్ను.. ఎవరు నన్ను పొలిటికల్ ఎంట్రీపై సంప్రదించలేదు. నాకు అస్సలు తెలియదు ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది. నాకు సినిమాలే.. అవే నాకు చాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఉద్దేశ్యం కానీ, కుప్పం నుంచి చంద్రబాబుకు పోటీ ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ నాకు లేవు” అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
— Vishal (@VishalKOfficial) July 1, 2022
