NTV Telugu Site icon

రివ్యూ: ‘విజయ రాఘవన్’ (తమిళ డబ్బింగ్)

Vijaya Raghavan Movie Review

Vijaya Raghavan Movie Review

సంగీత దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని, ఆ తర్వాత హీరోగా మారాడు. ‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ హిట్ మూవీతో తెలుగువారికీ చేరువయ్యాడు. అప్పటి నుండి అతని ప్రతి తమిళ చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంది. అలా తమిళంలో రూపుదిద్దుకున్న ‘కోడియిల్ ఒరవన్’ ఈ శుక్రవారం తెలుగులో ‘విజయ రాఘవన్’గా విడుదలైంది. ‘మెట్రో’ ఫేమ్ ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు వారి ముందుకు రవిచంద్రారెడ్డి, శివారెడ్డి తీసుకొచ్చారు.

అరకు సమీప గ్రామంలో పుట్టిన విజయ రాఘవన్ (విజయ్ ఆంటోని)కి ఒక్కటే కోరిక, ఐ.ఎ.ఎస్. కావాలని. నిజానికి ఆ కోరిక అతనిది అనేకంటే అతని తల్లి (దివ్యప్రభ)ది అని చెప్పడం సబబు. పంచాయితీ ప్రెసిడెంట్ గా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఆమె, తాను తన గ్రామానికి చేయలేకపోయినది… తన కొడుకు పెరిగి పెద్దయ్యాక చేయాలని భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా అతన్ని మోటివేట్ చేస్తుంది. అయితే ఐఎఎస్ అవ్వాలనుకున్న విజయ రాఘవన్ కల చెదిరిపోవడంతో రాజకీయాలలోకి ప్రవేశిస్తాడు? అక్కడ అతను ఎలా నిలదొక్కుకున్నాడు? రాజకీయ వైకుంఠపాళిలో అతను ఎదుర్కొన్నసమస్యలు ఏమిటీ? తల్లి కోరికను విజయ్ తీర్చగలిగాడా? లేదా? అనేదే ఈ సినిమా.

విజయ్ ఆంటోని హీరోగా నటించిన తొలి చిత్రాలన్నీ సైకలాజికల్ థ్రిల్లర్ కాగా, ఆ తర్వాత అతను ఎమోషనల్ డ్రామాస్ బాట పట్టాడు. అయితే కొంతకాలంగా సామాజిక సమస్యలను, రాజకీయ నేపథ్య చిత్రాలను చేస్తున్నాడు. ఈ తాజా చిత్రం ‘విజయ్ రాఘవన్’ కూడా పొలిటికల్ డ్రామానే! బ్యూరోక్రాట్ గా ఈ సమాజానికి సేవ చేయాలని భావించిన ఓ లెక్చరర్, తప్పని పరిస్థితుల్లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, ఆపైన రాష్ట్రాధినేతగా ఎదగడానికి ఏం చేశాడనే అంశాన్ని దర్శకుడు ఆనంద్ కృష్ణన్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. సినిమా ప్రథమార్థంలో హీరో రంగప్రవేశం కాస్తంత ఆలస్యమైనా, ఆ తర్వాత కథ చకచకా సాగిపోయింది. అరకు నుండి హైదరాబాద్ వచ్చిన అతను తన చుట్టూ ఉన్న వ్యక్తులను ఓర్పుతో మార్చే ప్రయత్నం చేయడం, అందులో ఓ మేరకు సక్సెస్ సాధించడం వరకూ బాగానే ఉంది. కానీ ద్వితీయార్థంలో ఈ మోటివేషన్ స్టోరీ… రాజకీయ చదరంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత రొటీన్ పొలిటికల్ డ్రామాగా మారిపోయింది. నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎత్తులూ పై ఎత్తులు వేయకతప్పదని ఈ సినిమాలో చూపించారు. లెక్చరర్ గా ఉన్న వ్యక్తి కార్పొరేటర్ గా గెలవడమనేది ఆసక్తికరంగానే ఉన్నా, ఆపైన ప్రతికూల పరిస్థితులకు తలొగ్గి రాజీనామా చేయడం, తనను, తల్లిని శారీరకంగా హింసించినప్పుడల్లా హీరో దారి మార్చుకోవడం అనే అంశాలు నిరాశను కలిగిస్తాయి. ద్వితీయార్థంలో చాలా సన్నివేశాలు రిపీట్ అయిన భావన కలుగుతుంది. అలానే హీరోకు, హీరోయిన్ కు మధ్య బాండింగ్ నూ ఆసక్తికరంగా దర్శకుడు చూపించలేకపోయాడు. మదర్ సెంటిమెంట్ ను మాత్రం బాగానే టేకిల్ చేశారు. ఇక ముగింపు విషయంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేశారు. ఇది చాలదన్నట్టుగా 2024లో ఈ మూవీకి సీక్వెల్ సైతం వస్తుందనే హింట్ ఇచ్చారు.

నటీనటుల విషయానికి వస్తే… గతంలో ఉన్న ఛార్మ్ విజయ్ ఆంటోనిలో కనిపించలేదు. దాంతో ఈ పాత్రకు అతను అంతగా ఫిట్ అనిపించలేదు. బాడీలాంగ్వేజ్ లోనూ తేడా కనిపిస్తోంది. పోరాట సన్నివేశాలలో మాత్రం చాలా స్టైలిష్ గా కనిపించాడు. హీరోయిన్ ఆత్మిక పాత్రకు పెద్దంత ప్రాధాన్యం లేదు. ఇక వైరి వర్గంలో ‘బాహుబలి’ కాలకేయ ప్రభాకర్, ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ఉన్నారు. హీరో తల్లిగా మలయాళ నటి దివ్య ప్రభ చేశారు. నివాస్ కె ప్రసన్న సంగీతం ఓకే. అయితే పాటలేవీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత మదిలో మెదిలేలా లేవు. కానీ వాటికి భాష్యశ్రీ సమకూర్చిన సాహిత్యం బాగుంది. అలానే మాటలు కూడా! ఉదయ్ కుమార్ కెమెరా పనితనం నీట్ గా ఉంది. ఓ సాధారణ వ్యక్తి సమాజానికి సేవ చేయాలనుకుంటే పొలిటీషియన్లు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తారనే విషయాన్ని దర్శకుడు ఆనంద్ కృష్ణన్ ఈ మూవీ ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేశారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టుగా ఆ వ్యక్తి తానూ రాజకీయ రంగంలోకే అడుగుపెడితే పర్యవసానం ఎలా ఉంటుందో చూపించారు. విజయ్ ఆంటోని అభిమానులకు, పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే ఆస్కారం ఉంది.

ప్లస్ పాయింట్స్

పొలిటికల్ డ్రామా కావడం
పోరాట సన్నివేశాలు
మదర్ సెంటిమెంట్

మైనెస్ పాయింట్స్

సినిమా రన్ టైమ్
బలహీనంగా ఉన్న ద్వితీయార్థం

ట్యాగ్ లైన్: సామాన్యుడి పాలి’ట్రిక్స్’!

రేటింగ్: 2.5 / 5

Show comments