Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?

Vijay Deverakonda (2)

Vijay Deverakonda (2)

Vijay Deverakonda: ఈ రోజుల్లో ఒక సినిమాలో హీరోగా నిలబడటం ఒక విజయం అయితే, పదేళ్ల పాటు వరుసగా ప్రేక్షకుల దృష్టిని తనవైపు నిలుపుకోవడం మరో పెద్ద విజయం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అదే చేసి చూపించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో సోలో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్, నేడు యువతారానికి రోల్ మోడల్ గా నిలిచాడు. విజయాలు, వైఫల్యాలు, విమర్శలు, ప్రశంసలు… ఇలా ఎన్నో మలుపులు ఎదురైనా తన వ్యక్తిత్వంతో ముందుకు సాగింది అతని పదేళ్ల సినీ ప్రయాణం. ‘పెళ్లి చూపులు’ విడుదలైన సమయంలో విజయ్ దేవరకొండపై పెద్దగా అంచనాలు లేవు. అప్పటికే ‘ఎవడే సుబ్రమణ్యం’లో ఒక గెస్ట్ రోల్ మాత్రమే చేశాడు. అయితే అతని నటన, కొత్త తరహా కథతో ‘పెళ్లి చూపులు’ మూవీ ఘనవిజయం సాధించింది. అయితే విజయ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం ‘అర్జున్ రెడ్డి’. ఆ చిత్రంలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత విజయ్ పేరు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగింది.

ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ విజయ్‌లోని మరో కోణాన్ని చూపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే రొమాంటిక్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం ‘టాక్సీవాలా’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’ వంటి సినిమాలు అంచనాలను అందుకోకపోయినా, ప్రతి కొత్త సినిమా ప్రకటనతో సోషల్ మీడియాలో భారీ హైప్ రావడం మాత్రం విజయ్ స్టార్‌డమ్‌కు నిదర్శనం. విజయ్ దేవరకొండ ప్రత్యేకత కేవలం సినిమాల్లోనే కాదు. యువతతో అతనికి ఏర్పడిన అనుబంధం కూడా అతని బలమే. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనా, కొత్త ప్రాజెక్ట్ ప్రకటించినా, ఇంటర్వ్యూ ఇచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం అతనికి సాధారణ విషయంగా మారిపోయింది. కెరీర్‌లో కొన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా, అభిమానుల్లో అతనిపై ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గకపోవడం కూడా అదే విషయాన్ని చెబుతోంది.

నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా విజయ్ తన ముద్ర వేస్తున్నారు. ‘రౌడీ వేర్’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించి యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా విద్యార్థులు, అవసరమైన సహాయం చేస్తూ సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు. స్టార్‌డమ్‌ను కేవలం వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడేలా మార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇక కెరీర్ పరంగా చూస్తే విజయ్ దేవరకొండకు ముందు ముందు మరింత కీలకమైన దశ ప్రారంభం కానుంది. ఇప్పటికే ‘రౌడీ జనార్దన్’, ‘రణబాలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు లైన్లో ఉండగా, మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సోలో హీరోగా పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ, ఒక నటుడిగా మాత్రమే కాదు, కొత్త తరానికి ప్రతీకగా కూడా నిలిచారు. భిన్నంగా ఆలోచించడం, తనదైన శైలిలో ముందుకు సాగడం, అభిమానులతో నేరుగా కనెక్ట్ కావడం వంటి లక్షణాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. రాబోయే రోజుల్లో ఈ స్టార్ మరిన్ని విజయాలతో తన ప్రయాణాన్ని తీసుకెళ్తారనే నమ్మకం అభిమానుల్లో అయితే బలంగా కనిపిస్తోంది.