NTV Telugu Site icon

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు ‘ఖుషి’ దక్కేనా!?

Vd

Vd

Vijay Devarakonda: హీరోగా విజయ్ దేవరకొండ కెమెరాముందు నిలవగానే ‘పెళ్ళిచూపులు’తో విజయం పలకరించింది. ఆపై ‘అర్జున్ రెడ్డి’గా ఘనవిజయం నడచివచ్చింది. అటుపై ‘గీత గోవిందం’తో అపూర్వ విజయం అందివచ్చింది. ఈ మూడు అనూహ్య విజయాలతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా ‘స్టార్ హీరో’ అనిపించుకున్నారు. ‘గీత గోవిందం’ తరువాత ఐదేళ్ళలో ఐదు సినిమాలు విజయ్ దేవరకొండ హీరోగా జనం ముందు నిలిచాయి. ఏవీ ఆయనకు విజయగీతను బోధించలేకపోయాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’గా నటించి, అలరించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ కి నిరాశే మిగిలింది. ప్రస్తుతం అచ్చివచ్చిన సమంతతో కలసి ‘ఖుషి’లో హీరోగా నటిస్తున్నారు విజయ్. గతంలో విజయ్, సమంత జోడీగా కనిపించిన ‘మహానటి’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. అందులో సబ్ ప్లాట్ లో వారిద్దరూ జంటగా అలరించినా, ఈ సారి మెయన్ ప్లాట్ లోనే కనువిందు చేయనున్నారు. సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ ‘ఖుషి’ జనం ముందుకు వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాతోనైనా విజయ్ కి ఓ భారీ విజయం దక్కాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

హైదరాబాద్ లో 1989 మే 9న జన్మించిన విజయ్ దేవరకొండ బాల్యంలోనే ఓ సినిమాలో తళుక్కుమన్నారు. ఆయన తండ్రి గోవర్ధనరావు కొన్ని టీవీ సీరియల్స్ కు డైరెక్టర్ గా పనిచేశారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి హై స్కూల్ లో విజయ్ చదివారు. అక్కడ ఉన్న సమయంలోనే సత్యసాయిబాబాపై రూపొందించిన ఓ ప్రచార చిత్రంలో మహానటి షావుకారు జానకి సమక్షంలో నటించాడు విజయ్. బి.కామ్, చదివిన విజయ్ మొదటి నుంచీ నటనాభిలాషతోనే సాగారు. దాంతో పాత్రల కోసం పాదాలు అరిగేలా తిరగడం మొదలెట్టారు. నటదర్శకనిర్మాత రవిబాబు రూపొందించిన ‘నువ్విలా’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు విజయ్. తరువాత శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అజయ్ అనే పాత్రలో నటించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’లో రిషి పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించారు విజయ్. ఆ గుర్తింపుతోనే విజయ్ కి ‘పెళ్ళి చూపులు’ చిత్రంలో హీరోగా నటించే అవకాశం లభించింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో, ‘ద్వారక’లోనూ హీరో అనిపించుకున్నారు. ఆపై సందీప్ వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’లో టైటిల్ రోల్ లో తనదైన బాణీ పలికించి, యువతకు దగ్గరయ్యారు.

Read Also: Telangana First Year Intermediate Results 2023

‘ఏ మంత్రం వేశావె’, ‘మహానటి’ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించారు విజయ్. ఇక పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీత గోవిందం’ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో విజయ్ దేవరకొండకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఆ పై అనేక యాడ్స్ లోనూ విజయ్ కనిపించారు. తాను సంపాదించిన ధనంతో ఓ ఛారిటబుల్ ట్రస్ట్ నూ ఏర్పాటు చేశారు విజయ్. ప్యాండమిక్ సమయంలో తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు సాగారు. తమ మహబూబ్ నగర్ లో ఏవీడీ సినిమాస్ అనే థియేటర్ ను నిర్మించి, తల్లి మాధవికి బహుమతిగా ఇచ్చారు దేవరకొండ బ్రదర్స్. ఇక తెలుగునేలపై ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వెంటనే స్పందిస్తూ తనకు తోచిన ఆర్థిక సాయం అందిస్తూ ఉంటారాయన.

‘గీత గోవిందం’ గ్రాండ్ సక్సెస్ తరువాత విజయ్ నటించిన “డియర్ కామ్రేడ్, టాక్సీవాలా, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్” వంటి చిత్రాలు వెలుగు చూశాయి. అయితే ఏవీ ‘గీత గోవిందం’ స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయాయి. ‘గీత గోవిందం’లో “వాట ద లైఫ్…” అంటూ సాగే పాటలో గొంతు కలిపి గాయకునిగానూ మారారు విజయ్. ఇక “ఈ నగరానికి ఏమయంది?, మీకు మాత్రమే చెబుతా, జాతిరత్నాలు” వంటి చిత్రాలలో అతిథి పాత్రలలో కనిపించారు విజయ్. పూరి దర్శకత్వంలోనే విజయ్ ‘జనగణమన’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారు. దాని కథ ఏమో కానీ, ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఖుషి’పైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రమైనా విజయ్ దేవరకొండకు ఆశించిన భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.