‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఇటీవలే దేశంలోని నాలుగు మూలలు చుట్టివచ్చారు. అంతేకాదు… వివిధ భాషల్లోని ఛానెల్స్ కు ఇంటర్వ్యూలూ ఇచ్చారు. అలా మలయాళ ప్రేక్షకుల కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీయార్… ‘ఇటీవల కాలంలో తన ఫోన్ లో ఎక్కువ సార్లు విన్న పాట ‘ఆశా పాశం’ మని చెప్పారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లోని ఆ పాట అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఎన్టీయార్ ఆ పాటలోని కొంత భాగాన్ని పాడి వినిపించారు కూడా! ఈ విషయం తెలిసిన ‘కేరాఫ్ కంచర పాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ ఇంటర్వ్యూలోని ఈ భాగాన్ని ఎడిట్ చేసి ట్వీట్ చేస్తూ, ఎన్టీయార్ కు వెంకటేశ్ మహా కృతజ్ఞతలు తెలిపాడు.
‘కేరాఫ్ కంచర పాలెం’తో దర్శకుడిగా పరిచయం అయిన వెంకటేశ్ మహా ఆ తర్వాత ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ‘స్టాండప్ రాహుల్’ మూవీలో వెంకటేశ్ మహా ఓ కీలక పాత్ర పోషించి, నటుడిగానూ తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ‘ఆశా పాశం’ పాట విషయానికి వస్తే స్వీకర్ అగస్తి స్వరాలు సమకూర్చిన ఈ పాటను విశ్వ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడారు. ఇటీవల ‘ఆహా’లో మొదలైన ‘తెలుగు ఇండియన్ ఐడిల్’లోనూ ‘ఆశా పాశం’ పాటను పాడి న్యాయనిర్ణేతల మనసుల్ని కూడా కంటెస్టెంట్స్ దోచుకోవడం విశేషం.