Site icon NTV Telugu

Varuntej: వాళ్ళిద్దరితో అయితే ఓకే..!!

Varuntej

Varuntej

దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వచ్చిన రియల్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్.’. అలాంటి సినిమా తెలుగులో ఇప్పట్లో మరొకటి తెరకెక్కుతుందో లేదో తెలియదు. అయితే సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోలతో కలిసి కొన్ని మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. కానీ వాటిని ‘రియల్ మల్టీస్టారర్’ కేటగిరిలో వేయడానికి ట్రేడ్ వర్గాలు అంగీకరించడం లేదు. నిజానికి ఇప్పటికే హీరోగా రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ యువ కథానాయకులు మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్ వంటి వాళ్ళతో సినిమాలు చేశాడు. అందులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ వెంకటేష్‌తో నటించిన యంగ్ హీరోస్ అంతా ఆ తర్వాత జనరేషన్ కదా అని కొందరు అంటున్నారు.

వెంకటేష్‌తో ఇప్పుడు ‘ఎఫ్ 3’ మూవీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌ను ‘మీ జనరేషన్ హీరోలతో ఎవరితో అయినా మల్టీస్టారర్ మూవీ చేయొచ్చు కదా’ అని ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ‘ఎవరితో సినిమా చేయడానికైనా తాను సిద్ధమేనని, అయితే తన తరం హీరోలలో సాయితేజ్‌తో నటించడాన్ని తాను ఇష్టపడతానని, ‘బావా… బావా…’ అంటూ అతనితో ఎప్పుడూ సరదాగా ఉంటానని, అలానే హీరో నితిన్‌తోనూ తనకు చక్కని అనుబంధం ఉందని, వారిద్దరితో కలిసి నటించమంటే మరో ఆలోచన లేకుండా చేసేస్తాన’ని బదులిచ్చాడు. అలానే వరుణ్‌ తేజ్ పెదనాన్న చిరంజీవిని ‘డాడీ’ అని పిలుస్తుంటాడు. ‘మీ డాడీతో సినిమా ఎప్పుడు చేస్తారు?’ అని అడిగిన ప్రశ్నకు ‘పెదనాన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన సినిమాలో చేయడానికి నేను రెడీ. ఆయన మూవీలో చేయడానికి పాత్ర గురించి కూడా ఆలోచించాల్సిన పనిలేదు’ అని చెప్పాడు. వరుణ్‌ తేజ్ నటించిన ‘గని’ ఈ శుక్రవారం విడుదల కాబోతుండగా, ‘ఎఫ్‌ 3’ మే 27న జనం ముందుకు వస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు వరుణ్‌ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. దీనికి నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Varuntej

 

Exit mobile version