NTV Telugu Site icon

Vani Jayaram: వాణీ జయరామ్‌కు తెలుగువారితో ‘ఎన్నెన్నో జన్మలబంధం’

Vani Jayaram Journey

Vani Jayaram Journey

Vani Jayaram: తెలుగు సినిమా వెలుగును మరింతగా ప్రసరింప చేసిన చిత్రాలలో ‘శంకరాభరణం’ స్థానం ప్రత్యేకమైనది. ఆ సినిమా 1980 ఫిబ్రవరి 2న విడుదలయింది. ఆ చిత్రం విడుదలైన సరిగా 43 సంవత్సరాలకు ఆ చిత్ర సృష్టికర్త కళాతపస్వి కె.విశ్వనాథ్ పరమపదించడం గమనార్హం! ఆయన కన్నుమూసిన రెండు రోజులకే ఆ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా నిలచిన వాణీజయరామ్ సైతం తుదిశ్వాస విడవడం సంగీతాభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. కొద్దిరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం వాణీ జయరామ్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అది అందుకోకుండానే వాణీ జయరామ్ తుదిశ్వాస విడవడంతో అభిమానులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు.

Online Trafficking: ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టురట్టు.. ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్ అరెస్ట్

వాణీ జయరామ్ ను తలచుకోగానే ఆమె గళం నుండి జాలువారిన అనేక మధురగీతాలు మన మదిలో చిందులు వేస్తాయి. ‘భారతంలో ఒక అమ్మాయి’ టైటిల్ సాంగ్ లో వాణీ జయరామ్ గళం సాగిన తీరు ఈ నాటికీ సంగీతాభిమానులను కట్టిపడేస్తూనే ఉంది. ఇక ‘పూజ’ చిత్రంలో ఆమె ఆలపించిన “ఎన్నెన్నో జన్మలబంధం… నీదీ నాదీ…” అన్న గీతం అయితే అభిమానులకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. “విధిచేయు వింతలన్నీ…” (మరోచరిత్ర), “నువ్వడిగింది ఏ నాడైనా కాదన్నానా…”(వయసు పిలిచింది), “సాగర సంగమమే…” (సీతాకోకచిలుక), “ఆలోకయే శ్రీ బాలకృష్ణం…” (శ్రుతిలయలు), “రోజాలో లేతవన్నెలే…”, “ఒక బృందావనం…” (ఘర్షణ) వంటి పాటలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. “ప్రణతి ప్రణతి ప్రణతి… ప్రణవనాద జగతికి…” అంటూ ‘స్వాతికిరణం’లో ఆమె ఆలపించిన తీరు సైతం కట్టిపడేస్తుంది. ఇవే కాకుండా పలువురు గాయనీగాయకులతో కలసి వాణీ జయరామ్ ఆలపించిన గీతాలు సైతం మధురం పంచాయి. ఇవన్నీ ఒక ఎత్తు – ‘శంకరాభరణం’లో మహదేవన్ బాణీలకు అనువుగా వాణీ జయరామ్ గాత్రంలో జాలువారిన “బ్రోచేవారెవరురా…”, “దొరకునా ఇటువంటి సేవా…”, “మానస సంచరరే…”, “పలుకే బంగారమాయెనా…”, “ఏ తీరుగ నను దయచూచెదవో…” అంటూ సాగే సంప్రదాయ గీతాలు మరో ఎత్తు అని చెప్పక తప్పదు.

Jr.NTR Political Entry: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చినా లాభంలేదు..!

ఇలా మధురాతి మధురాలను మన సొంతం చేసిన వాణీ జయరామ్ కు ‘పద్మభూషణ్’ ప్రకటించగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఉవ్వెత్తున ఎగసిన ఆ ఆనందం ఆమె మరణవార్త వినగానే ఉస్సూరుమని కూలింది. తెలుగు మాతృభాష కాకపోయినా వాణీ జయరామ్ ఆలపించిన తెలుగుపాటలు నిత్యం సంగీతాభిమానులను ఏదో ఒక రూపంలో అలరిస్తూనే ఉన్నాయి. ఆమె అభిమానులు అదే పనిగా వాణీ పాటతోనే సాగుతూ ఉంటారు. అలాంటివారందరూ ‘వాణీ జయరామ్ ఇకలేరు’ అన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది నిజం కాకూడదనీ, ఏదో కాకి వార్త అని ఆమె జీవించే ఉంటారనీ అభిమానులు పలువిధాలా భావిస్తున్నారు. వాణీ జయరామ్ తుదిశ్వాస విడిచారన్న చేదునిజాన్ని తట్టుకోవడం కష్టమే! అయితే గాయపడిన హృదయాలన్నీ వాణి పాటతోనే సేద తీరుతాయని భావించవచ్చు.

Buttabomma Movie Telugu Review : ‘బుట్టబొమ్మ’

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలతో పాటు గుజరాతీ, మరాఠీ, మార్వాడీ, హర్యానీ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లిష్ భాషల్లోనూ వాణీజయరామ్ తన గళంతో మధురం పంచారు. మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా నిలిచారు వాణీ జయరామ్. 1975లో కె.బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’లో పాటలు పాడి జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా నిలిచారు వాణీజయరామ్. 1979లో ‘శంకరాభరణం’తోనూ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారామె. 1991లో కె.విశ్వనాథ్ ‘స్వాతికిరణం’లో “ఆనతినీయరా…” పాటతో మరోమారు జాతీయ ఉత్తమగాయనిగా నిలిచారు. వాణీ జయరామ్ కీర్తి కిరీటంలో పలు అవార్డులూ రివార్డులూ వెలిశాయి. వాటన్నిటినీ చూసుకుంటూ ఆ మధురాన్ని మననం చేసుకోవడమే మనం చేయవలసి పని. వాణీ జయరామ్ పంచిన మధురాన్ని మననం చేసుకోవడం ద్వారానే ఆమెకు అసలైన నివాళి అర్పించిన వారమవుతాం.

Show comments