Epic: బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రీసెంట్ గా మూవీ ట్రైలర్ లాంచ్ కి రష్మిక సందడి కూడా చేశారు. విజయ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. యూత్ లో క్రేజ్ క్రియేట్ అయిన ఈ ‘ఎపిక్’ మూవీ 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక వైష్ణవి చైతన్య, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘బేబీ’ సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ‘బేబీ’ తరహా సినిమా అనుకుని థియేటర్‌కు వెళ్తే మాత్రం ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతి ఎదురవుతుందని హీరోయిన్ వైష్ణవి చైతన్య చెబుతోంది. ఈ సినిమాలో తన పాత్ర పేరు కడలి అని, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సమయంలో బయటకు రావాలనుకునే కడలి ఉంటుందని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
కడలి పాత్ర చాలా స్ట్రాంగ్
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’లో వైష్ణవి చైతన్య కడలి అనే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తన కోసం తాను నిలబడే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా కడలి పాత్రను చూపించనున్నట్లు వైష్ణవి తెలిపింది. తన నిర్ణయాలపై క్లారిటీతో ఉండే అమ్మాయి కడలి అని చెప్పింది. మరోవైపు ఆనంద్ దేవరకొండ పోషించిన ఆదిత్య పాత్ర మాత్రం చాలా సాఫ్ట్‌గా, కామ్‌గా ఉంటుందని తెలిపింది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడన్నది సినిమాలో ఇంట్రెస్టింగ్ గా చూపించారని చెప్పింది.
ప్రతి ఒక్కరిలోనూ కడలి ఉంటుంది
కడలి పాత్ర తన నిజ జీవితానికి ఎంతవరకు దగ్గరగా ఉంటుందన్న ప్రశ్నకు వైష్ణవి ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉంది. ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉంటుందని ఆమె చెప్పింది. అయితే కుటుంబం, సమాజం వంటి కారణాల వల్ల మనలోని ఆ వెర్షన్ చాలాసార్లు బయటకు రాదని తెలిపింది. కానీ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ తమ కోసం తాము నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది. అందుకే కడలి పాత్ర తన మనసుకు చాలా దగ్గరైందని వైష్ణవి వెల్లడించింది.
‘బేబీ’ తర్వాత కథల విషయంలో జాగ్రత్త
‘బేబీ’ తర్వాత తన కథల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు వైష్ణవి తెలిపింది. కథలోనే కాకుండా తన పాత్రలో కూడా కొత్తదనం ఉండాలని, ఆ పాత్రలో తనను తాను చూసుకోగలగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ‘ఎపిక్’ కథలో ఆ కొత్తదనం కనిపించడం వల్లే ఈ సినిమాను ఎంచుకున్నానని వెల్లడించింది.
ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?
‘ఎపిక్’లో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ గురించి చర్చ ఉంటుంది కాబట్టి కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఎలా స్వీకరిస్తారన్న ప్రశ్న కూడా ఉంది. దీనిపై వైష్ణవి స్పష్టంగా స్పందించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడొచ్చని చెప్పింది.
‘90s’ వెబ్ సిరీస్ తరహాలో పూర్తిగా క్లీన్ ఎంటర్‌టైనర్ కాకపోయినా, దర్శకుడు కథకు అవసరమైన విషయాలను మాత్రమే చూపించారని తెలిపింది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సినిమాను రూపొందించారని, ఇబ్బందికరంగా అనిపించే సన్నివేశాలు ఉండవని చెప్పింది. దీంతో ‘ఎపిక్’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు తీసుకొస్తుందా అన్న ఆసక్తి పెరుగుతోంది.
ఆదిత్య హాసన్ డైరెక్షన్ ప్రత్యేకం
‘90s’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ‘ఎపిక్’తో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించిందని వైష్ణవి చెప్పింది. జీవితాన్ని చాలా లోతుగా గమనించే వ్యక్తి ఆదిత్య అని, చిన్న చిన్న విషయాల్లో కూడా ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే విధానం తనకు నచ్చిందని తెలిపింది.
అసలు ఆదిత్యను తాను మొదటిసారి ‘ఎపిక్’ కథ చెప్పడానికి వచ్చినప్పుడే కలిశానని వైష్ణవి వెల్లడించింది. అంతకుముందే ఆయన తెరకెక్కించిన ‘90s’ వెబ్ సిరీస్ చూసినట్లు, అది తనకు చాలా నచ్చిందని చెప్పింది. ‘ఎపిక్’లో కూడా చిన్న చిన్న విషయాలకు దర్శకుడు ఇచ్చిన ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుందని ఆమె తెలిపింది.
‘బేబీ’తో పోల్చకుండా చూడాలి
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మళ్లీ కలిసి నటిస్తుండటంతో ‘బేబీ’ ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది. అయితే రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైనవని వైష్ణవి స్పష్టం చేసింది. ‘బేబీ’ ఒక ప్రత్యేకమైన సినిమా అయితే, ‘ఎపిక్’ కూడా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుందని చెప్పింది.
ఈ సినిమాలో తమను చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ‘బేబీ’ గుర్తుకు రాకపోతేనే తాము సక్సెస్ అయినట్లు భావిస్తామని వైష్ణవి చెప్పింది. ‘ఎపిక్’ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం మొదటి నుంచే ఉందని తెలిపింది.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలోకి రానుంది. ‘బేబీ’ జోడీ మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తుందా, కడలి పాత్ర ద్వారా వైష్ణవి చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

