దక్షిణాది తారలు ఎందరో ఉత్తరాది చిత్రాలతోనూ తమదైన బాణీ పలికించారు. వారిలో కొందరు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వైజయంతీమాల స్థానం ప్రత్యేకమైనది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘బహార్’ 1951 అక్టోబర్ 26న జనం ముందు నిలచింది. ఏవీయమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏవీ మెయ్యప్పన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఎమ్.వి.రామన్ దర్శకత్వం వహించారు.
‘బహార్’ కథ విషయానికి వస్తే – ధనవంతుల అమ్మాయి అయిన లతను పెళ్ళాడాలనుకుంటాడు శేఖర్. ఆమె వసంత్ కుమార్ ను ప్రేమించి ఉంటుంది. పల్లెటూరికి వెళ్ళిన శేఖర్ అక్కడ మాలతి అనే అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేస్తాడు. ఆమె గర్భవతి అవుతుంది. ఇంట్లో ముఖం చూపించలేక, శేఖర్ వద్దకు వెళ్తుంది. శేఖర్ కాదంటాడు. చనిపోవాలనుకుంటుంది. సముద్రంలో పడ్డ ఆమెను రక్షిస్తారు కొందరు. పండంటి బిడ్డకు జన్మనిస్తుంది.
వసంత్ ను ఎలాగైనా తప్పించి, లతను పెళ్ళిచేసుకోవాలని చూస్తాడు శేఖర్. మాలతి కొడుకును సంరక్షిస్తాడు వసంత్. ఆ అబ్బాయి వసంత్ బిడ్డనే అని మాయమాటలు చెబుతాడు శేఖర్. లత నమ్మి వాదిస్తుంది. అక్కడే అసలు విషయాలు తెలుస్తాయి. దాంతో శేఖర్ ను నిలదీస్తాడు వసంత్. ఇద్దరూ పోట్లాడుకుంటారు. కుర్చీతో శేఖర్ ను కొట్టబోతాడు వసంత్. మాలతి వచ్చి అడ్డు పడుతుంది. ఆమె తలకు గాయమవుతుంది. శేఖర్ లో పరివర్తన కలుగుతుంది. పశ్చాత్తాపం చెందుతాడు. మాలతిని తన భార్యగా స్వీకరిస్తాడు. ఆమె బిడ్డకు తానే తండ్రినని అంగీకరిస్తాడు. లత, వసంత్ పెళ్ళితో కథ ముగుస్తుంది.
ఈ కథను ఎమ్.వి.రామన్ రాశారు. 1949లో ఏవీ మెయప్పన్ దర్శకత్వంలో ‘వాళ్కై’ పేరుతో తమిళంలో రూపొంది విజయం సాధించింది. ఇదే కథను 1950లో ఎమ్.వి.రామన్ దర్శకత్వంలో ‘జీవితం’ తెలుగు చిత్రంగా తెరకెక్కించారు మెయ్యప్పన్. తెలుగునాట కూడా ‘జీవితం’ మంచి విజయం అందుకుంది. 1951లో ఇదే కథ రామన్ దర్శకత్వంలోనే హిందీలో ‘బహార్’గా రూపొంది, అక్కడా ఘనవిజయం సాధించింది.
ఈ మూడు భాషల్లోనూ వైజయంతీ మాల తన పాత్రను తానే పోషించారు. ఈ మూడింటా వైజయంతీమాలకు ఈ కథతోనే తొలి చిత్రాలు రూపొందడం విశేషం. తమిళ, తెలుగు భాషల్లో టి.ఆర్. రామచంద్రన్ హీరోగా నటించారు. తమిళంలో మరో నాయికగా ఎమ్.ఎస్. ద్రౌపది నటించగా, తెలుగులో ఆ పాత్రను ఎస్.వరలక్ష్మి ధరించారు.
తమిళంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎస్వీ సహస్రనామం పోషించగా, తెలుగులో ఆ పాత్రలో సిహెచ్. నారాయణ రావు అభినయించారు. ఇదే పాత్రను హిందీలో ప్రాణ్ ధరించారు. ఇక హిందీలో మరో నాయికగా పండరీబాయ్ నటించారు. కానీ, టైటిల్స్ లో వైజయంతీమాలను, పద్మినీని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం! అసలు ఇందులో పద్మిని నటించనే లేదు. హిందీలో హీరోగా కరణ్ దేవన్ నటించారు. మిగిలిన పాత్రల్లో ఓం ప్రకాశ్, సుందర్, చమన్ పురి, సంబందం, తబస్సుమ్, లీలా మిశ్రా కనిపించారు.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వైజయంతీమాలకు నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఆమె అందం, అభినయం అన్నింటా ఆకట్టుకున్నాయి. హిందీలో ఈ సినిమాతోనే వైజయంతీ మాలకు మంచి గుర్తింపు లభించి, ఇటు తమిళంలో, అటు హిందీలో బిజీ అయిపోయారు. తరువాతి రోజుల్లో హిందీలోనే వైజయంతీమాల అందాల అభినయం విశేషంగా సాగింది. “నాగిన్, మధుమతి, సంగం, జువెల్ థీఫ్, ఆమ్రపాలి” వంటి జనరంజకమైన చిత్రాలలో నటించి వైజయంతీమాల హిందీ చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా సాగారు.
ఇక 1984, 1989 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1993లో రాజ్యసభ సభ్యురాలయ్యారు. 1999లో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వైజయంతీమాల బీజేపీలో చేరారు. అప్పటి నుంచీ అందులోనే కొనసాగుతున్నారు. అలా నటిగా, రాజకీయనాయకురాలిగా వైజయంతీమాల రాణించడానికి కారణంగా నిలచింది ఎమ్.వి.రామన్ రాసిన కథతో రూపొందిన ‘బహార్’.
