తెలుగు ఇండియన్ ఐడిల్ తుది దశకు చేరుకుంది. ఆరుగురు కంటెస్టెంట్స్ తో జరిగే సెమీ ఫైనల్ కు బాలకృష్ణ గెస్ట్ గా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇది జూన్ 10వ తేదీ ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బాలకృష్ణ ‘నేను జడ్జిని కాదు… వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ ను’ అంటూ తోటి కంటెస్టెంట్స్ లో హుషారు పుట్టించాడు. ధరిమిశెట్టి శ్రీనివాస్ తో పెళ్ళికి సంబంధించిన ముచ్చట్లు పెట్టడం, వాగ్దేవిని పూజా హెగ్డేతో పోల్చడంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సెమీ ఫైనల్స్ కు ముందు ఓటింగ్ కు సంబంధించిన చివరి ఎపిసోడ్ లో సీనియర్ క్రేజీ సింగర్ ఉషా ఉతప్ పాల్గొన్నారు.
శ్రీరామచంద్రను ఆటపట్టించిన ఉషా ఉతప్
షో ప్రారంభం కాగానే శ్రీరామచంద్ర న్యాయనిర్ణేతల గురించి, అప్పుడప్పుడూ గెస్టుల మీద కూడా కవితలు చదువుతున్నాడు. అయితే కర్ణకఠోరంగా ఉండే ఆ కవితల గురించి తమన్ నిర్మొహమాటంగానే తన మనసులో మాట చెప్పేస్తుంటాడు. ఎప్పటిలానే తాజా ఎపిసోడ్ లోనూ శ్రీరామచంద్ర అతిథిగా వచ్చిన ఉషా ఉతప్ పై ఓ కవిత చదివాడు. అందులో ఆమె గాత్రం గంభీరంగా ఉంటుందని చెప్పేసరికీ దానిని నెగెటివ్ గా తీసుకున్న ఉషా ఉతప్ శ్రీరామచంద్రపై కోపం ప్రదర్శించింది. తన ఉద్దేశ్యం అది కాదని ఆమె కాళ్ళకు నమస్కరించి, క్షమించమని శ్రీరామ్ కోరినా అంగీకరించలేదు. అయితే ఆ తర్వాత ప్రోగ్రామ్ డైరెక్టర్ వచ్చి ఉషా ఉతప్ ను సముదాయించే పనిచేశారు. చివరకు ఇదంతా తాను సరదాగా చేశానని, తనకు తన మీద జోక్ వేసినా కోపం రాదని ఉషా చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదంతా ప్రాంక్ అనే విషయం వ్యూవర్స్ చాలా ముందుగానే గెస్ చేశారు. నిజానికి షో చివరి దశకు వచ్చిన సమయంలో ఇలాంటి సరదా ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టి ఉంటే బాగుండేది. న్యాయనిర్ణేతలు ఒక్కోసారి సింగర్స్ ను కోపంతో తిడుతున్నా… ఇదంతా తర్వాత మెచ్చుకోవడానికి చేస్తున్న అతి అనేది అందరికీ అర్థమైపోతోంది.
రెహ్మాన్ పాటలకు పట్టాభిషేకం
సెమీ ఫైనల్స్ కు ముందు జరిగిన ఈ ఎపిసోడ్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ రెహ్మాన్ పాటలనే పాడటం విశేషం. అయితే ఇది రెహ్మాన్ స్పెషల్ అనే విషయాన్ని నిర్వాహకులు ఎక్కడా హైలైట్ చేయలేదు. తెలుగులో తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన ‘కీచురాళ్ళు’ పాటతో కార్యక్రమానికి ఉషా ఉతప్ శ్రీకారం చుట్టారు. అలానే కార్తీక్, శ్రీరామచంద్రతో కలిసి ఉషా మెడ్లీతో ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ లో వేర్వేరు ఇన్ స్ట్రుమెంట్స్ ఉపయోగించినా, ఒక్కో కంటెస్టెంట్ పక్కన ఒక్కో వాద్యకారుడు ఒక ఇన్ స్ట్రుమెంట్ తో వాద్యసహకారం అందించారు. మొదటగా లాలస ‘జీన్స్’ మూవీలోని ‘కన్నులతో చూసేది గురువా…’ పాటను పాడింది. ఆ తర్వాత వచ్చిన ధరిమిశెట్టి శ్రీనివాస్ ‘ముత్తు’ సినిమాలోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటను పాడి బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనిపించుకున్నాడు. మూడో కంటెస్టెంట్ ప్రణతి ‘లవ్ బర్డ్స్’ మూవీలోని ‘మేఘం..’ గీతాన్ని ఆలపించింది. ఆమె పాటకు ఫిదా అయిన న్యాయనిర్ణేతలు బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబిచ్చారు. గత వారం ఎలిమినేషన్స్ సమయంలో ప్రణతి జస్ట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ తో ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యింది. ఇప్పుడు ఆమె తిరిగి సరైన ట్రాక్ లోకి వచ్చిందని నిత్యామీనన్ తెలిపింది. కంటెస్టెంట్స్ లో పిన్నవయస్కురాలైన వైష్ణవి ‘సాహసం శ్వాసగా సాగిపో’లోని పాటను అద్భుతంగా పాడి, బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంది. ఆమె తర్వాత వాగ్దేవి ‘ఐ’ మూవీలోని పాటను పాడి న్యాయనిర్ణేతల మెప్పుపొందింది. ఆమెకూ బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ జడ్జీలు కితాబిచ్చారు. ఆ తర్వాత ఆది సాయికుమార్, గాయకుడు, సంగీత దర్శకుడు రఘురామ్ తో కలిసి వేదిక మీదకు వచ్చాడు. వారి కొత్త సినిమా ‘క్రేజీ ఫెల్లో’ కోసం శ్రీరామచంద్ర పాడిన పాటను ఈ వేదికపై ఆవిష్కరించారు. చివరగా జయంత్ ‘విలన్’ మూవీలోని పాటను పాడాడు. ప్రతి ఒక్కరినీ ఉషా ఉతప్ ‘తెలుగు ఇండియన్ ఐడిల్ కావాలని ఎందుకు అనుకుంటున్నావ్?’ అని ప్రశ్నించి, ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టింది. కంటెస్టెంట్స్ చాలామంది తమ పేరెంట్స్ కోరిక తీర్చడం కోసమే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నామని చెప్పడం విశేషం.
