పక్కా తెలుగు ఓటిటి ‘ఆహా’లో త్వరలో ప్రారంభం కానున్న టాక్ షో “అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే”. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోతో హీరో బాలకృష్ణ తన డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డిజిటల్ ప్లాట్ఫామ్లో బాలయ్య ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మొదటి ఎపిసోడ్ “అన్స్టాపబుల్” ప్రోమో వచ్చింది. క్లాసీ షేర్వాణీ, శాలువా ధరించి ప్రోమోలో బాలయ్య ట్రెడిషనల్, రాచరిక లుక్ లో కన్పించాడు. ‘అన్స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ హాజరైంది. ఇందులో బాలయ్య మోహన్ బాబును అడిగిన ప్రశ్నలు షో పై క్యూరియాసిటీ పెంచాయి.
Read Also : “ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్” క్లాష్… రాజమౌళి ఏమన్నాడంటే ?
“నేను మీకు తెలుసు…నా స్థానం మీ మనసు” అనే డైలాగ్తో బాలయ్య స్మాషింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ‘జై బాలయ్య’ అనే నినాదాలతో బాలయ్యకు స్వాగతం పలికారు. “చాదస్తం…ఇంట్రడక్షన్ కాకుండానే వచ్చేస్తారు” అంటూ స్టార్టింగ్ లోనే బాలయ్యపై పంచ్ వేశారు. ఒకరి వయస్సు గురించి మరొకరు జోకులేసుకుని ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత కొన్ని సీరియస్ ప్రశ్నలను వేశారు బాలయ్య. అందులో చిరంజీవి గురించి, అలాగే మోహన్ బాబు జీవితం, ఆయన పార్టీ మారడం గురించి కూడా ప్రశ్నించారు. ఆ తరువాత మంచు లక్ష్మీ, మనోజ్ ఎంట్రీ ఇచ్చారు.