Site icon NTV Telugu

Tollywood: ఈ వీకెండ్‌లో 2 ప్లస్ 2

Vikrant Rona

Vikrant Rona

Two  plus Two Movies  this weekend!

రెండు వారాలుగా తెలుగులో సినిమా విడుదల జోరు కాస్తంత తగ్గింది. వారానికి మూడు నాలుగు చిత్రాలే రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం విషయానికి వస్తే, రెండు డబ్బింగ్ సినిమాలతో పాటు రెండు స్ట్రయిట్ మూవీస్ జనం ముందుకు రాబోతున్నాయి. గురువారం బాద్ షా, కిచ్చా సుదీప్‌ నటించిన త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ కన్నడ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ నిర్మాత జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ రిలీజ్ చేయబోతున్నారు. ఉత్తరభారతంలో ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ అండగా నిలిచారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ‘విఆర్’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు.

గురువారం జనం ముందుకొస్తున్న మరో సినిమా ‘ది లెజెండ్’. ప్రముఖ తమిళ వ్యాపారవేత్త శరవణన్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఊర్వశీ రౌతేలా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జెడీ- జెర్రీ డైరెక్షన్ చేసిన ‘ది లెజెండ్’ మూవీ కూడా ఐదు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగు వర్షన్ ను ప్రముఖ పంపిణీ దారుడు ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తుండటం విశేషం.

ఇక మాస్ మహరాజా రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ శుక్రవారం వస్తోంది. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి దీన్ని నిర్మించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో కాస్తంత గ్యాప్ తర్వాత హీరో వేణు రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ప్రధాన పాత్రలలో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ‘ఈ రోజుల్లో’ ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు కనిపించబోతున్నారు. రవితేజ ఎంఆర్వోగా నటించిన ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదే రోజున ఐదు వేర్వేరు కథలతో రూపుదిద్దుకున్న ఆంథాలజీ మూవీ ‘పంచతంత్ర కథలు’ కూడా థియేటర్లలో విడుదల కానుంది. గంగనమోని శేఖర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వ్యాపారవేత్త డి. మధు ఈ సినిమాను నిర్మించారు. ఇందులో నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియా, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. సో… ఈ నాలుగు సినిమాలలో దేనివైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతారో చూడాలి.

Exit mobile version