ఎనిమిదేళ్ళ క్రితం ‘అలా ఎలా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హెబా పటేల్. ఈ తర్వాత సంవత్సరమే వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’తో సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకుంది. ఆపై ‘ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్’ చిత్రాలు హేబా కు మంచి పేరే తెచ్చిపెట్టాయి. బట్… ఆ తర్వాత వచ్చిన ‘మిస్టర్, అంథగాడు, ఏంజిల్, 24 కిసెస్’ చిత్రాలు పరాజయం పాలు కావడంతో ఆమె కెరీర్ ట్రాక్ తప్పింది. గత యేడాది వచ్చిన ‘రెడ్’లో హెబా ఐటమ్ సాంగ్ కూడా చేసేసింది. అయితే… కొంతకాలంగా గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలని అమ్మడు తపిస్తోంది. అలా ఆమె నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున జనం ముందుకు వస్తుండటం విశేషం.
వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘గీత’. ఇందులో హెబా పటేల్ మూగ అమ్మాయిగా నటించింది. తన కళ్ళముందు జరిగిన ఓ అన్యాయాన్ని ఎదుర్కొవడం కోసం మూగపిల్ల అయిన గీత ఏం చేసిందన్నదే ఈ చిత్ర కథ. దీన్ని ఆర్. రాచయ్య నిర్మించారు. సునీల్ ఇందులో కీ – రోల్ ప్లే చేయగా, సాయి కిరణ్ విలన్ గా నటించాడు. ‘గీత’ సినిమా ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల కాబోతోంది. యువ దర్శకుడు సంపత్ నంది తన శిష్యుడు అశోక్ తేజ ను ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీతో డైరెక్టర్ ను చేశాడు. తానే ఆ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఈ సినిమాను కె. కె. రాధామోహన్ నిర్మించారు. హెబా పటేల్ కీలక పాత్ర పోషించిన ఈ నేచురల్ డ్రామాలో ‘కేజీఎఫ్’ ఫేమ్ వశిష్ఠ సింహతో పాటు సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలు చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆగస్ట్ 26న ఆహాలో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతోంది. అలా హెబా పటేల్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున ఒకటి థియేటర్లలోనూ, మరొకటి ఓటీటీలోనూ రాబోతున్నాయి.