Site icon NTV Telugu

Dhanush: ఇర‌వై ఏళ్ళ న‌ట‌విరాట్ … ధ‌నుష్!

Dhanush

Dhanush

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ పేరు విన‌గానే, ఆయ‌న విల‌క్ష‌ణ‌మైన అభిన‌యం ముందుగా గుర్తుకు వ‌స్తుంది. ధ‌నుష్ తండ్రి కార్తిక్ రాజా త‌మిళ చిత్ర‌సీమ‌లో పేరు మోసిన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు. అన్న సెల్వ‌రాఘ‌వ‌న్ పేరున్న ద‌ర్శ‌కుడు. ఆరంభంలో వారి నీడ‌న నిల‌చిన ధ‌నుష్ త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడు అయ్యాడు. ఇవ‌న్నీ ధ‌నుష్ కు మొద‌టిరోజుల్లో కాసింత గుర్తింపు తేవ‌డానికి ప‌నికి వ‌చ్చాయి. త‌రువాత అంతా ధ‌నుష్ స్వ‌యంకృషితో సాధించుకున్న‌దే. త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాళ‌ చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాదు హిందీలోనూ న‌టించేసి న‌టునిగా త‌న‌దైన బాణీ ప‌లికించారు. ఇప్పుడు అంత‌ర్జాతీయ చిత్రాల్లోనూ న‌టిస్తున్నాడు. అలా వైవిధ్యంగా త‌న న‌ట‌విశ్వ‌రూపం చూపిస్తూ సాగుతున్న ధ‌నుష్ మే 10తో న‌టునిగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాడు. ధనుష్ తండ్రి కార్తిక్ రాజా ద‌ర్శ‌క‌త్వంలోనే తొలిసారి న‌టించాడు. ఆ సినిమా `తుల్లువ‌దో ఇల్ల‌మై`. 2002 మే 10న విడుద‌లై విజ‌యం సాధించింది. ఈ చిత్రం తెలుగులో అల్ల‌రి న‌రేశ్ హీరోగా `జూనియ‌ర్స్` పేరుతో విడుద‌ల‌యింది.

ధ‌నుష్ కార్తిక్ రాజ్ 1983 జూలై 28న మ‌ద్రాసులో జ‌న్మించాడు. 19 ఏళ్ల‌కే హీరోగా మంచి మార్కులు సంపాదించాడు. ఇక ధ‌నుష్ రెండో సినిమా `కాద‌ల్ కొండేన్` కు ఆయ‌న అన్న సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించింది. ఇందులో ధ‌నుష్ న‌ట‌న చూసి ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు. ఈ సినిమాను తెలుగులో `నేను` పేరుతో అల్ల‌రి న‌రేశ్ హీరోగా తెర‌కెక్కించారు. “పొల్లాద‌వ‌న్, యార‌డీ నీ మోహిని, ఆడుకాల‌మ్, మ‌ర్యాన్, అనేగ‌న్, కోడి, వ‌డ‌చెన్నై, అసుర‌న్, మారి, వెలైఇల్లా ప‌ట్టాదారి“ చిత్రాల‌తో త‌మిళ జ‌నాన్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాడు ధ‌నుష్. ఈ చిత్రాల‌లో కొన్ని తెలుగులోనూ అనువాద‌మై అల‌రించాయి. `ఆడుకాల‌మ్, అసుర‌న్“ చిత్రాలు ధ‌నుష్ ను జాతీయ స్థాయిలో ఉత్త‌మ‌న‌టునిగా నిలిపాయి. హిందీలో ధ‌నుష్ న‌టించిన “రాంఝ‌నా, ష‌మితాబ్“ వంటి హిందీ చిత్రాల‌లోనూ ధ‌నుష్ త‌న‌దైన బాణీ ప‌లికించాడు. `ష‌మితాబ్`లో మ‌హాన‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ తోనూ న‌టించి మెప్పించాడు ధ‌నుష్. `ది ఎక్స్ ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద ఫ‌కీర్` అనే ఇంగ్లిష్ చిత్రంలోనూ ధ‌నుష్ త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

ఈ యేడాది `మార‌న్`తో జ‌నం ముందు నిల‌చిన ధ‌నుష్ కు ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆనందం పంచ‌లేదు. అయితే ధ‌నుష్ రాబోయే చిత్రాల‌పైనే ఆయ‌న‌, అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. “ద గ్రే మేన్“ అనే ఇంగ్లిష్ చిత్రంతో పాటు `స‌ర్` అనే తెలుగు చిత్రం, “తిరుచిత్రాంబ‌లం, వాతి“ అనే త‌మిళ చిత్రాల‌లో ధ‌నుష్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాల‌తో ధ‌నుష్ త‌న‌దైన బాణీ ప‌లికిస్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు. మే 10న న‌టునిగా ఇర‌వై ఏళ్ళు పూర్తి చేసుకున్న ధ‌నుష్ కు ఆయ‌న ఫ్యాన్స్ తో పాటు ఎంద‌రో త‌మిళ సినీ ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలిపారు. రాబోయే రోజుల్లో ధ‌నుష్ ఇంకా ఎంత‌లా అల‌రిస్తాడో చూడాలి.

Exit mobile version