NTV Telugu Site icon

25 Years for ‘Encounter’ Movie: పాతికేళ్ళ ‘ఎన్ కౌంటర్’

Twenty Five Years for 'Encounter' Movie :

Twenty Five Years for 'Encounter' Movie :

Twenty Five Years for ‘Encounter’ Movie : తమ పద్మాలయా సంస్థ ద్వారా తెలుగు సినిమాకు పలు సాంకేతిక సొబగులు అద్దారు కృష్ణ, ఆయన సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు. కొంతమంది సాంకేతిక నిపుణులు ఉనికి చాటుకోవడానికీ పద్మాలయా సంస్థ దోహదపడింది. పద్మాలయా సంస్థ నిర్మించిన ‘ఎన్ కౌంటర్’ సినిమా ద్వారా యన్.శంకర్ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతోనే ఆయన ‘ఎన్ కౌంటర్’ శంకర్ గా సుప్రసిద్ధులయ్యారు. నటశేఖర కృష్ణతో పాటు ఆయన పెద్ద కొడుకు రమేశ్ బాబు కూడా ఈ చిత్రంలో నటించారు. 1997 ఆగస్టు 14న ‘ఎన్ కౌంటర్’ చిత్రం జనం ముందు నిలచింది.

కొందరు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన యన్.శంకర్ దర్శకుడు కావాలని కథలు రూపొందించుకొని ప్రయత్నాలు సాగించారు. అదే సమయంలో వారి స్వస్థలం నల్గొండ జిల్లా భువనగిరి దగ్గర వలిగొండ లో ఎన్ కౌంటర్ పేరిట 22 ఏళ్ళ లోపున్న నలుగురు కుర్రాళ్ళు బలయ్యారు. దాంతో ఆ నేపథ్యంలోనే కథ రూపొందించి, కొందరు నిర్మాతలను సంప్రదించారు శంకర్. అయితే ఎవరూ ఈ ఎన్ కౌంటర్ ను తెరకెక్కించడానికి సాహసించలేదు. ఆ సమయంలో కృష్ణ, ఆయన సోదరులు శంకర్ కు పచ్చ జెండా ఊపారు.

ఇంతకూ ‘ఎన్ కౌంటర్’ కథ ఏమిటంటే – పేదలకు అండగా కృష్ణన్న దళం పనిచేస్తుంటుంది. పేదప్రజల భూములు లాక్కుని, కోట్లకు పడగలెత్తిన ఓ రాష్ట్ర మంత్రికి దళంలోని స్వర్ణక్క హెచ్చరిక లేఖ రాస్తుంది. అతని నీడన ఉన్న శాసనసభ్యులు ఆ ఉత్తరం చూసి బెంబేలెత్తి పోతారు. కృష్ణన్న దళాన్ని మట్టుపెట్టడానికి యస్పీ సిద్ధార్థను ప్రత్యేకంగా రిక్రూట్ చేస్తారు. అదే ప్రాంతంలోని ఓ పల్లెలో ఓ తల్లి (రాధిక) కష్టపడి తన కొడుకు రమేశ్ ను డాక్టర్ గా చదివిస్తుంది. పట్నంలో ఉన్న రమేశ్, పోలీసుల బుల్లెట్లకు గాయాలపాలయిన స్వర్ణక్కకు ఆశ్రయమిస్తాడు. ఆమె కోలుకొనేలా చేస్తాడు. కానీ, స్వర్ణక్కను మాటు వేసి పోలీసులు కాల్చి చంపుతారు. స్వర్ణక్కకు ఆశ్రయమిచ్చాడని రమేశ్ ను అరెస్ట్ చేస్తారు. కొడుకు జాడ తెలియక తల్లడిల్లిన తల్లికి రహీమ్ అనే ఓ పోలీస్ ద్వారా అతని కబురు తెలుస్తుంది. తల్లి చూడడానికి వస్తే పోలీసు అధికారి అనుమతించడు. అదే సమయంలో మరో నలుగురు కుర్రాళ్ళతో పాటు రమేశ్ ను కూడా ఎన్ కౌంటర్ లో లేపాయలని భావిస్తాడు ఆ ఇన్ స్పెక్టర్. అయితే రహీమ్ అడ్డుకుంటాడు. దాంతో ఇన్ స్పెక్టర్ రహీమ్ ను చంపుతాడు. ఆ నలుగురు యువకులను చంపబోతుండగా, అంతకు ముందే రహీమ్ ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణన్న దళం వచ్చి ఆ యువకులను రక్షిస్తుంది. రమేశ్ తల్లి తన కొడుకును రక్షించమని కృష్ణన్నను వేడుకుంటుంది. రమేశ్ లొంగిపోతే అతని భవిష్యత్ బాగుండేలా చూస్తానని ఎస్పీ సిద్ధార్థ అంటాడు. కానీ, అదే సమయంలో ఓ పోలీస్, సిద్ధార్థను చంపబోతాడు. కృష్ణన్న వాడిని మట్టు పెడతాడు. సిద్ధార్థకు కూడా అసలు దోషులు ఎవరో తెలుస్తుంది. చివరకు ఎన్ కౌంటర్లకు కారకుడైన మంత్రిని కృష్ణన్న కాల్చిచంపుతాడు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయాలపాలయిన కృష్ణన్న కన్నుమూస్తూ పోరాటాన్ని సాగించమని రమేశ్ కు చెబుతాడు. కృష్ణన్న చేతిలోని ఆయుధం రమేశ్ తీసుకోవడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో వినోద్ కుమార్, రాధిక, రోజా, రుచితా ప్రసాద్, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్, జీవా, మహర్షి, బాలాజీ, కాకరాల, మదన్ మోహన్, మాస్టర్ ఉదయ్, ప్రసాద్ బాబు, శకుంతల, రాధా ప్రశాంతి, రత్నసాగర్, తెనాలి శకుంతల, సుబ్బరాయశర్మ తదితరులు నటించారు. చంద్రమోహన్, రాజారవీంద్ర, శివాజీరాజా, వల్లభనేని జనార్దన్, పి.యల్.నారాయణ అతిథి పాత్రల్లో కనిపించారు.
వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, గండవరపు సుబ్బారావు, యన్. శంకర్ పాటలు రాశారు. యమ్.వి.యస్.హరనాథరావు సంభాషణలు పలికించారు.

ఈ చిత్రంలోని “పల్లె తెల్లవారె తుమ్మెదా…”, “ఊరూవాడా అక్కల్లారా…”, “ఎన్ కౌంటర్ ఎన్ కౌంటర్…”, “జై బోలో జై బోలో అమరవీరులకు జై బోలో…”, “యుద్ధం చేద్దామురో.. సిద్ధం అయిదామురో…” అంటూ సాగే పాటలు అలరించాయి. కృష్ణ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి జి.ఆదిశేషగిరిరావు నిర్వహణ వహించగా, జి.హనుమంతరావు నిర్మాతగా వ్యవహరించారు. కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం యన్.శంకర్ నిర్వహించారు. ‘ఎన్ కౌంటర్’ చిత్రం జనాదరణ పొందింది. శతదినోత్సవం చూసింది. దర్శకునిగా యన్. శంకర్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.