NTV Telugu Site icon

Trivikram@20: మాట‌ల మాంత్రికుడు మెగాఫోన్ ప‌ట్టి ఇర‌వై యేళ్ళు!

Trivikram

Trivikram

Trivikram@20: ఆకెళ్ళ నాగ శ్రీనివాస శ‌ర్మ అంటే తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అన‌గానే… ‘ఓ ఆయ‌నా…. మాటల మాంత్రికుడు… మా గురూజీ… ఎందుకు తెలియ‌దు!?’ అంటారు. తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు త్రివిక్ర‌మ్ ప‌ట్ల ఉన్న గౌరవంతో కూడిన అభిమానం అది.

త్రివిక్ర‌మ్ ఇవాళ టాలీవుడ్ కు దిక్సూచి! తెలుగు సినీ ర‌చ‌యిత‌ల‌కు, యువ ద‌ర్శ‌కుల‌కు మార్గ‌ద‌ర్శి. అత‌ని ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని న‌టీన‌టులు త‌హ‌త‌హ‌లాడ‌తారు. అత‌ని నేతృత్వంలో ప‌నిచేయాల‌ని సాంకేతిక నిపుణులు ప‌రిత‌పిస్తారు. విశాఖలో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చేసిన ఈ భీమ‌వ‌రం బుల్లోడు తెలుగు సినిమా రంగంలోకి స‌హాయ ర‌చ‌యిత‌గా అడుగుపెట్టి ప‌లు చిత్రాల‌కు ప‌నిచేశారు. అయితే ఆ క్ర‌మంలో ర‌చ‌యిత‌ పోసాని కృష్ణ ముర‌ళీ శిష్య‌రికంలో తాను నేర్చుకున్న‌దే ఎక్కువ అంటారు త్రివిక్ర‌మ్. 1999లో ‘స్వ‌యంవ‌రం’ మూవీతో మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌రిచ‌యమైన త్రివిక్ర‌మ్, మొద‌టిసారి మెగా ఫోన్ ప‌ట్టుకున్న‌ది మాత్రం 2002 లో ‘నువ్వే నువ్వే’ చిత్రం కోసం. అప్ప‌టికే ‘స్ర‌వంతి’ ర‌వికిశోర్ బ్యాన‌ర్ లో ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు న‌చ్చావ్’ చిత్రాల‌కు మాట‌లు అందించారు త్రివిక్ర‌మ్. ఈ రెండు సినిమాలు ఘ‌న విజ‌యం సాధించాయి. అత‌ని ప్రతిభను గుర్తించిన ర‌వికిశోర్ ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ ను ‘నువ్వే నువ్వే’తో ప‌రిచ‌యం చేశారు. దానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లేను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మే స‌మ‌కూర్చుకున్నారు. అక్టోబ‌ర్ 10, 2012లో ఈ సినిమా విడుద‌లైంది. అంటే నేటికి ఇర‌వై సంవ‌త్స‌రాలు. ఈ సందర్భంగా ఈ నెల 10వ తేదీ ఏఎంబీ లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం ‘నువ్వే నువ్వే’ స్పెష‌ల్ స్క్రీనింగ్ జ‌రుగ‌బోతోంది. దీనికి మూవీ యూనిట్ మొత్తం హాజరవుతోంది.

తరుణ్, శ్రియా జంట‌గా న‌టించిన ‘నువ్వే నువ్వే’ మూవీలో ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర పోషించారు. సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా గ్రాండ్ స‌క్సెస్ సాధించ‌క‌పోయినా నిర్మాత‌కు లాభాల‌నైతే తెచ్చిపెట్టింది. సంగీత ద‌ర్శ‌కులు కోటి అందించిన పాట‌లు ఈ సినిమాను మ్యూజిక‌ల్ హిట్ చేశాయి. త్రివిక్రమ్ రాసిన మాటలు విశేష ఆదరణ చూరగొన్నాయి. అంతేకాదు ఉత్త‌మ చిత్రంగా ర‌జిత నందితో పాటు ఉత్త‌మ మాట‌ల ర‌చ‌యిత‌గా ఈ సినిమాతో త్రివిక్ర‌మ్ నంది అవార్డును పొంది, హ్యాట్రిక్ సాధించాడు. అయితే ద‌ర్శ‌కుడిగా ఈ మూవీ త్రివిక్ర‌మ్ కు పూర్తి స్థాయి సంతోషాన్ని ఇవ్వ‌లేదు. త‌న‌లోని ద‌ర్శ‌కుడిని మాట‌ల ర‌చ‌యిత డామినేట్ చేశాడ‌నే త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికీ భావిస్తాడు. అందుకే ఆ త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల్లో మాట‌ల‌ను చాలా బాలెన్స్డ్ గా రాసుకున్నారు త్రివిక్ర‌మ్.

‘నువ్వే నువ్వే’ సినిమా త్రివిక్ర‌మ్ కు సంతృప్తిని క‌లిగించ‌క‌పోవ‌చ్చు కానీ ర‌చ‌యిత‌గా ఆయ‌న్ని అభిమానించిన వారికి మాత్రం తెగ న‌చ్చేసింది. త్రివిక్ర‌మ్ లో గొప్ప స్టోరీ టెల్ల‌ర్ ఉన్నాడ‌నే విష‌యాన్ని వాళ్ళు, వాళ్ళ‌తో పాటు తెలుగు సినిమా రంగం కూడా నమ్మింది. అందులో ఒక‌రు ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత ముర‌ళీమోహ‌న్ కాగా మరొకరు మహేశ్ బాబు. అలా వ‌చ్చిన త్రివిక్ర‌మ్ రెండో సినిమా ‘అత‌డు’! మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ ఫ‌స్ట్ కాంబినేషన్ లో వ‌చ్చిన ఈ మూవీ థియేట్రిక‌ల్ గా గొప్ప రెవెన్యూ ఇవ్వ‌లేదు కానీ బుల్లితెర‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఓ ప్ర‌ముఖ ఛానల్ త‌న టీఆర్పీ త‌గ్గుతోంద‌ని ఎప్పుడు అనిపించినా, యాడ్ రెవెన్యూను పెంచుకోవాల‌నుకున్నా అందుకు తురుపుముక్క ‘అత‌డు’ సినిమానే! ఇక త్రివిక్ర‌మ్ తనివి తీరా విజ‌యాన్ని ఆస్వాదించిన సినిమా ‘జ‌ల్సా’! ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన ‘జ‌ల్సా’ చూసి ఆనందప‌డ‌ని మెగా ఫాన్స్ లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ను అందుకుని స‌రికొత్త‌గా ఇండ‌స్ట్రీ రికార్డులు సృష్టించింది.

మ‌హేశ్ తో త్రివిక్ర‌మ్ తీసిన మలిచిత్రం ‘ఖ‌లేజా’ క‌మ‌ర్షియ‌ల్ హిట్ కాక‌పోయినా మ్యూజికల్ గా మ‌హేశ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఆ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవ‌డానికి జ‌నాల‌కు కాస్తంత స‌మ‌యం ప‌ట్టింది. కానీ ఆ లోగానే థియేట‌ర్ల నుండి సినిమా వెళ్ళిపోయింది. ఆ క‌సిలోంచి వ‌చ్చిన ‘జులాయి’తో త్రివిక్ర‌మ్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లోని రొమాంటిక్ యాంగిల్ కు ప్రాధాన్య‌మిస్తూనే, పర్ ఫెక్ట్ ఛేజింగ్ మూవీగా ‘జులాయి’ని తెర‌కెక్కించి విజ‌యం సాధించారు త్రివిక్ర‌మ్.

ఇక ప‌వ‌న్ తో చేసిన రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ సైతం ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ప‌వ‌న్, స‌మంత జంట‌గా న‌టించిన ఈ మూవీ మెగా ఫ్యాన్ ను పూర్తి స్థాయిలో మెప్పించింది. ఆ వెంట‌నే త్రివిక్ర‌మ్ బ‌న్నీతో తీసిన ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేదు కానీ ఇదీ మ్యూజిక‌ల్ హిట్టే. ఆ త‌ర్వాత నితిన్ తో ‘అ ఆ’ మూవీని తెర‌కెక్కించి, ఏ క‌థానాయ‌కుడికైనా తాను స‌క్సెస్ ఇవ్వ‌గ‌ల‌న‌ని త్రివిక్ర‌మ్ నిరూపించుకున్నాడు. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ మూడో సినిమా ‘అజ్ఞాత‌వాసి మాత్రం ఘోర ప‌రాజ‌యం పాలైంది. అయితే ఆ వెంట‌నే ఎన్టీయార్ తో త్రివిక్ర‌మ్ తీసిన ‘అర‌వింద స‌మేత’ చ‌క్క‌ని విజ‌యాన్ని అందుకోవ‌డం విశేషం. అదే ఊపుతో స్టైలిష్ స్టార్ బ‌న్నీతో ‘అల వైకుంఠ‌పుర‌ము’లో మూవీ తీసి మ‌రోసారి ఇండ‌స్ట్రీ రికార్డ్స్ ను తిరగరాశారుత్రివిక్ర‌మ్! ఇలా మెగా ఫోన్ చేతిలోకి తీసుకుని, గ‌డిచిన ఇర‌వై యేళ్ళ‌లో త్రివిక్ర‌మ్ తీసింది కేవ‌లం 11 సినిమాలే. ప‌న్నెండో సినిమా ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌హేశ్ బాబుతో తెర‌కెక్క‌బోతోంది.

ఇంతింతై వ‌టుడింతై… అన్న చందాన అసిస్టెంట్ రైట‌ర్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి త‌న ప్ర‌తిభా పాట‌వాల‌తో స్టార్ రైట‌ర్ గా, గ్రేట్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. ఇంకో విశేషం ఏమంటే… ఆయ‌న ఇప్పుడు నిర్మాత కూడా! ఫార్య్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ పెట్టి, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి త్రివిక్ర‌మ్ సినిమాల‌ను నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని త‌న మాట‌ల‌తో, చేత‌ల‌తో మ‌రింత ఉన్న‌త స్థితికి త్రివిక్ర‌మ్ తీసుకెళుతున్నారన్నది వాస్త‌వం. అందుకే ఈ దిగ్ద‌ర్శ‌కుడు మెగాఫోన్ ప‌ట్టి 20 సంవ‌త్స‌రాలు పూర్తి అయిన సంద‌ర్భంగా మ‌న‌సారా అభినందిద్దాం.