Trivikram: ఈ తరం ప్రేక్షకులు ‘మాటల మాంత్రికుడు’ అని దర్శకరచయిత త్రివిక్రమ్ కు పట్టం కట్టేశారు. త్రివిక్రమ్ సైతం తన ప్రతి చిత్రంలో మాటలతో పరాక్రమం చూపిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు పదనిసలు పలికించినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు సరిగమలూ వినిపిస్తాయి. మరికొన్ని సార్లు వీరధీరశూరంగా విజృంభిస్తాయి. అందుకే జనం ‘మాటల మాంత్రికుడు’ అనేశారు. త్రివిక్రమ్ కూడా ఆ మాటను నిలుపుకుంటూ తన కలంతో కదం తొక్కుతూనే ఉన్నారు. ఇప్పటికి ఆరు సార్లు ఉత్తమ మాటల రచయితగా నందిని దక్కించుకున్నారు. దీనిని బట్టి ఆయన మాటే మంత్రమై జనాన్ని పరవశింప చేస్తోందని చెప్పవచ్చు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ 1971 నవంబర్ 7న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. త్రివిక్రమ్ చదువులో దిట్ట అనిపించారు. డిగ్రీ దాకా భీమవరంలోనే సాగిన త్రివిక్రమ్ చదువు తరువాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘న్యూక్లియర్ ఫిజిక్స్’లో గోల్డ్ మెడల్ సంపాదించింది. బాల్యం నుంచీ సినిమాలపై ఆకర్షణ పెంచుకున్నారు త్రివిక్రమ్. ఆయనతో కాలేజ్ మేట్ అయిన సునీల్ సైతం అదే ధ్యాసతో ఉండడం వల్ల మిత్రులు హైదరాబాద్ చేరారు. చిత్రసీమలో ప్రయత్నాలు మొదలెట్టారు. అప్పట్లో పోసాని కృష్ణమురళి కథలు, మాటలతో అలరిస్తున్నారు. ఆయన చెంతకు చేరి, కొన్ని చిత్రాలకు రచన చేశారు త్రివిక్రమ్. తరువాత ‘స్వయంవరం’ చిత్రం కోసం దర్శకుడు కె.విజయభాస్కర్ తో జోడీ కట్టారు. ఆ సినిమా విజయం తరువాత త్రివిక్రమ్, విజయభాస్కర్ జంట భలేగా నవ్వుల పంటలు పండించింది.
‘నువ్వే నువ్వే’ చిత్రంతో తొలిసారి డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ ఇప్పటి దాకా పదకొండు చిత్రాలు రూపొందించారు. వాటిలో ‘నువ్వే నువ్వే’ ఓ మోస్తరుగా విజయం సాధించింది. ‘ఖలేజా, అజ్ఞాతవాసి’ కంగారు పెట్టాయి. కానీ, బుల్లితెరపై కవ్వించాయి. మిగిలిన ఎనిమిది చిత్రాలూ జనాన్ని విశేషంగా అలరించాయనే చెప్పాలి. త్రివిక్రమ్, మహేశ్ తో తెరకెక్కించిన తొలి చిత్రం ‘అతడు’ హైదరాబాద్ లో రజతోత్సవం చూసింది. ఈ సినిమా థియేటర్లలో కన్నా మిన్నగా బుల్లితెరపై మురిపించింది. తరువాత ‘జల్సా, అత్తారింటికి దారేది’ చిత్రాలతో పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్స్ అందించారు. జూనియర్ యన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తీసి ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ తో వరుసగా ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో నవ్వుల పువ్వులు పూయించారు. నితిన్ కు ‘అ ఆ’ గ్రాండ్ సక్సెస్ తో ఎంతో ఊరట కలిగించారు.
మాటతోనే మంత్రం వేసిన త్రివిక్రమ్ ‘ఒకరాజు-ఒకరాణి’ చిత్రంలో పాటలూ పలికించారు. ఎందుకనో గీతరచనను అటకెక్కించేసి, మాటలతోనే సాగుతున్నారు. తాను దర్శకునిగా సక్సెస్ సాధించిన తరువాత కూడా త్రివిక్రమ్ మాటలు రాయడం మానలేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు రాశారు. త్రివిక్రమ్ ప్రతిభకు పట్టం కడుతూ 2015 సంవత్సరం బి.యన్.రెడ్డి జాతీయ అవార్డును ఆయనకు ప్రకటించారు. ఇప్పటికే మహేశ్ బాబుతో “అతడు, ఖలేజా” వంటి చిత్రాలు రూపొందించిన త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి ఆయనతో సినిమా తీస్తున్నారు. త్వరలోనే ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రంతోనూ త్రివిక్రమ్ తమను ఎంతగానో అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అభిలాష నెరవేరాలని ఆశిద్దాం.