Trisha Krishnan Punch On Hariteja Comments In Ponniyin Selvan Event: అభిమాన తారలు కనిపించినప్పుడు.. ఎవ్వరైనా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంటారు. వాళ్లతో కలిసి నటించిన నటీనటులు (సైడ్ యాక్టర్స్) సైతం.. అంతే ఎగ్జైట్‌మెంట్‌కి గురవుతుంటారు. ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక.. తంటాలు పడుతుంటారు. సరిగ్గా అలాంటి తంటాలే హరితేజ పడింది. తన తొలి సినిమాలో త్రిషాతో కలిసి నటించిన ఆమె.. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత కలిసే అవకాశం రావడంతో కాస్త నోరు జారింది. అయినా త్రిషా లాంటి స్టార్ యాక్టర్ ఊరికే ఉంటుందా? అప్పటికప్పుడే దానికి తనదైన శైలిలో రియాక్షన్ ఇచ్చేసింది. అసలేం జరిగిందంటే..
మణిరత్నం రూపొందించిన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్-1 ఈనెల 30వ తేదీన గ్రాండ్‌గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌ని హేమంత్‌తో కలిసి నటి హరితేజ హోస్ట్ చేసింది. ఈ యాంకరమ్మ చాలా హుషారుగానే హోస్ట్ చేసింది కానీ, త్రిషా వచ్చినప్పుడే కాస్త తడబడింది. త్రిషా ప్రసంగించిన తర్వాత హిమతేజ మాట్లాడుతూ.. ‘‘నేను నా మొదటి సినిమాతో మీతోనే కలిసి నటించాను. అదే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. అందులో నేను మీ చెల్లిగా నటించాను. అప్పుడు ప్రతీరోజూ మీ వెనకే ఉండేదాన్ని’’ చెప్పింది. ఇంతలో త్రిషా అందుకొని.. ‘‘నా వయసు పెరిగిందన్న అనుభూతిని హరితేజ కలిగిస్తుంది. అయినా పర్వాలేదు నేను ఆమె మాటల్ని కాంప్లిమెంట్‌గా తీసుకుంటున్నాను’’ అని వెంటనే పంచ్ వేసింది.
అయితే.. ఆ పంచ్‌ని పట్టించుకోకుండా హరితేజ అదే ఎగ్జైట్‌మెంట్‌లో నాటి అనుభూతుల్నే గుర్తు చేసుకుంది. ఆ సినిమాలో నటించినంత కాలం ‘నా ముందు త్రిషా’ ఉన్నారంటూ తానెంతో సంబరపడిపోయేదాన్నని చెప్పుకొచ్చింది. వీరిద్దరి మధ్య ఈ సంభాషణ కాస్త హైలైట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. కాగా.. తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు మణిరత్నంకు త్రిషా థాంక్స్ చెప్పింది. అలాగే.. చాలాకాలం తర్వాత తాను హైదరాబాద్‌కి తిరిగొచ్చినా, ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో ఆదరిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రెజెంట్ చేస్తున్నందుకు నిర్మాత దిల్‌రాజుకి ధన్యవాదాలు తెలిపింది.
