నవరత్నాలు కూడా రాళ్ళే! కాకపోతే, ఖరీదైన రాళ్ళు. నవ్వితే నవరత్నాలు రాలే వరం ఎలాంటిదో తెలియదు కానీ, రాళ్ళపల్లి నవ్వుల్లో నవరత్నాలు రాలినట్టే ఉండేది. హాస్యనటునిగా అంతలా ఆకట్టుకున్నారు రాళ్ళపల్లి. తనదైన వాచకంతో, తన ఆంగికానికి తగ్గ అభినయంతో రాళ్ళపల్లి వందలాది చిత్రాల్లో నవ్వులు పూయించారు. ఒకప్పుడు పీలగా ఉంటూ నవ్వించిన రాళ్ళపల్లి కాలచక్రం కదలికల్లో బాగా బొర్రపెంచేశారు. ఆ బొజ్జతోనే నవ్వులు పూయించి మెప్పించారు. ఎక్కువగా నవ్వించినా, కొన్ని చిత్రాల్లో కవ్వించారు, మరికొన్నిట కన్నీరు పెట్టించారు, ఇంకొన్నిట దుష్ట పాత్రల్లో చెలరేగిపోయారు. రాళ్ళపల్లి అభినయం అనేక చిత్రాలకు ఓ ఎస్సెట్ గానే నిలచింది.
రాళ్ళపల్లి ఆయన ఇంటిపేరు. అసలు పేరు వెంకట నరసింహారావు. 1945 ఆగస్టు 15న అనంతపురంలో జన్మించారు. పండితుల వంశంలో పుట్టడం వల్ల రాళ్ళపల్లికి పిన్నవయసులోనే పురాణాలపై పట్టు ఉండేది. ఆ జ్ఞానంతోనే పలు నాటకాల్లో శ్రావ్యంగా పాడుతూ ఆకట్టుకున్నారు. టీనేజ్ లో అడుగు పెట్టేసరికే రాళ్ళపల్లి రంగస్థలంపై మంచిపేరు సంపాదించుకున్నారు. అనేక వైవిధ్యమైన పాత్రల్లో అలరించారు. కానీ, చిత్రసీమ వైపుకు ఆయన పయనం ఆలస్యంగా సాగడానికి ఊరూరా వేషాలు వేయడమే కారణమని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘స్త్రీ’లో కీలక పాత్రలో కనిపించిన రాళ్ళపల్లి తరువాత తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ పోయారు. ‘సీతాకోకచిలుక’లో రాళ్ళపల్లి పాత్రకు మంచి పేరు లభించింది. తరువాత మహానటుల చిత్రాల్లోనూ పాత్రలు దక్కాయి. దాంతో నటునిగా ఇట్టే గుర్తింపు సంపాదించేశారు. ‘అభిలాష’లో సెంట్రీగా నటించి ఆకట్టుకున్నారు. “శుభలేఖ, ఖైదీ, చండశాసనుడు, మంత్రిగారి వియ్యంకుడు, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ప్రేమించు పెళ్ళాడు” వంటి చిత్రాల్లో రాళ్ళపల్లి నటన ఇట్టే జనాన్ని పట్టేసింది. విలక్షణ దర్శకుడు వంశీకి రాళ్ళపల్లి నటనలోని ఈజ్ ఎంతగానో నచ్చింది. వంశీ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అన్వేషణ’లో రాళ్ళపల్లి కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత వంశీతో పాటు అనేక మంది ప్రముఖ దర్శకులు తమ చిత్రాల్లో రాళ్ళపల్లికి తగ్గ పాత్రలు ఇస్తూ వచ్చారు. అన్నిటా తనదైన బాణీ పలికిస్తూ సాగారు రాళ్ళపల్లి.
తాను బాగుండడమే కాదు, ఇతరులూ బాగుండాలని అభిలషించేవారు రాళ్ళపల్లి. నటుడు తనికెళ్ళ భరణికి ఆ రోజుల్లో షెల్టర్ ఇచ్చి ప్రోత్సహించింది ఈయనే. ఈ విషయాన్ని భరణి సైతం ఎన్నో సార్లు చెప్పుకున్నారు. అయితే అందుకు రాళ్ళపల్లి అంగీకరించేవారు కారు. “నాకు చేతనైంది నేను చేశాను. అంతేకానీ, భరణి పైకి రావడానికి ఆయన ప్రతిభే కారణం” అంటూ ఉండేవారు రాళ్ళపల్లి. ఆయన అభినయానికి అనేక అవార్డులూ రివార్డులూ లభించాయి. “పట్నం పిల్ల- పల్లెటూరి చిన్నోడు, జీవనజ్యోతి” చిత్రాల ద్వారా ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డులు అందుకున్నారు రాళ్ళపల్లి. టీవీ సీరియల్స్ లోనూ తనదైన బాణీ పలికించారు. కడదాకా తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికే తపించారు రాళ్ళపల్లి. 2019 మే 17న రాళ్ళపల్లి కన్నుమూశారు. ఆయన నటించిన అనేక చిత్రాలు ఇప్పటికీ బుల్లితెరపై దర్శనమిస్తూనే ఉన్నాయి.
