NTV Telugu Site icon

75 ఏళ్ళ పవర్ తగ్గని పరుచూరి గోపాలకృష్ణ!

తెలుగు చిత్రసీమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పరుచూరి బ్రదర్స్ మాటలు కోటలు దాటుతూ, సినీజనానికి కోట్లు సంపాదించి పెడుతూనే ఉన్నాయి. అన్న వెంకటేశ్వరరావు అనురాగం పలికిస్తే, తమ్ముడు గోపాలకృష్ణ ఆవేశం ఒలికిస్తారు. ఎంత అన్నదమ్ములైనా నలభై ఏళ్ళుగా కలసి రచనావ్యాసంగం సాగించడమంటే మాటలు కాదు. బహుశా చిత్రసీమలో ఇది ఓ అరుదైన విశేషమని చెప్పాలి. సెంటిమెంట్ ను వండడంలో మేటి వెంకటేశ్వరరావు అని పేరు, ఇక ఎమోషన్ పండించడంలో గోపాలకృష్ణకు సాటి లేరెవ్వరు అంటూ ఉంటారు. వారితో కలసి పనిచేసిన దర్శకనిర్మాతలు మళ్ళీ మళ్ళీ ఈ అన్నదమ్ముల రచన కోసమే పరితపించారంటే వారి పెన్ పవర్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

పరుచూరి బ్రదర్స్ లో చిన్నవారయిన గోపాలకృష్ణ 1946 సెప్టెంబర్ 25న జన్మించారు. వారి కన్నవారు పరుచూరి రాఘవయ్య, హైమావతమ్మ. గోపాలకృష్ణకు ఇద్దరు అన్నలు వారిలో పెద్దవారు వెంకటేశ్వరరావు, తరువాతి అన్న కుటుంబరావు. కనిష్ఠుడు పరుచూరి గోపాలకృష్ణ. వారిది రైతుకుటుంబం. “ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి, ముగ్గురూ కూలీకి పోయినా మూడు కుంచాలు తీసుకు వస్తారు” అంటూ హైమావతమ్మతో బంధువులు అనేవారట. తన పిల్లలు కూలీపనికి పోవాలా అంటూ ఆమె ఆవేదన చెందేవారు. ఎలాగైనా ముగ్గురినీ చదించాలని తపించారామె. తల్లి తపన వల్లే ముగ్గురు కొడుకులు మంచి విద్యావంతులయ్యారు. పరుచూరి వెంకటేశ్వరరావుకు ఏజీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఆయన పనిచేస్తూనే నాటకాలు రాస్తూ, పక్కనే ఉన్న రవీంద్ర భారతిలో ప్రదర్శించేవారు. గోపాలకృష్ణ ఎమ్.ఎ. తెలుగుచేశాక పశ్చిమ గోదావరిలోని లాల్ బహదూర్ శాస్త్రి కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. తరువాత కృష్ణాజిల్లా ఉయ్యూరులోని అడుసుమిల్లి గోపాలకృష్ణ అండ్ షుగర్ కేన్ గ్రోవర్స్ కాలేజ్ లో తెలుగు డిపార్ట్ మెంట్ హెడ్ గానూ ఉన్నారు. సెలవుల్లో అన్నయ్య వెంకటేశ్వరరావు వద్దకు వెళ్ళి, ఆయనతో పాటు కొన్ని చిత్రాలకు రచన చేసేవారు. 1981లో ఈ సోదరులిద్దరూ మహానటుడు యన్.టి.రామారావును కలుసుకున్నారు. ఆయన వారిద్దరినీ కలిపి ‘పరుచూరి బ్రదర్స్’గా మార్చి తన ‘అనురాగదేవత’తో తొలి అవకాశం కల్పించారు. ఆ తరువాత యన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘చండశాసనుడు’కు కూడా వీరు రచన చేశారు. రామారావు ఈ బ్రదర్స్ కు నామకరణం చేసిన వేళావిశేషమేంటో కానీ, అప్పటి నుంచీ ఇప్పటి దాకా పరుచూరి సోదరులు తెలుగువారిని తమ రచనతో అలరిస్తూనే ఉన్నారు.

సమకాలీన సమస్యలను పురాణగాథలతో పోల్చి, వాటిని అనుసంధానించి రచనలు చేయడంలో మేటి అనిపించుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఎమోషన్ పండించే సమయంలో పరుచూరి గోపాలకృష్ణ తన పురాణ పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకొనేవారు. అందుకే ఆయన రాసిన సంభాషణల్లో తరచూ మన పురాణగాథల్లోని విశేషాలు వినిపిస్తూ ఉంటాయి. యన్టీఆర్ తో వారి అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన రాజకీయాల్లోకి వెళ్తూ చివరగా నటించిన ‘నాదేశం’ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. ఆయన నటజీవితంలో చివరి సినిమాగా రూపొందిన ‘మేజర్ చంద్రకాంత్’కు కూడా వారే కథ, మాటలు రూపొందించారు. ఇక చిరంజీవిని ‘ఖైదీ’గా జనం మదిలో నిలపడంలోనూ, బాలకృష్ణను పవర్ ఫుల్ మాస్ హీరోగా మలచడంలోనూ, వెంకటేశ్ ను స్టార్ గా మార్చడంలోనూ పరుచూరి బ్రదర్స్ కలం బలం దాగుంది. ఈ టాప్ స్టార్సే కాకుండా ఎంతోమంది యంగ్ హీరోస్ కు కూడా పరుచూరి బ్రదర్స్ పలికించిన మాటల తూటాలు, వడ్డించిన భాషాపరోటాలు తెలుగువారికి ఆనందం పంచాయి.

రచనలోనే కాదు నటనలోనూ భళా అనిపించారు పరుచూరి సోదరులు. అభినయంలోనూ తన రూటే సెపరేటు అంటూ సాగారు పరుచూరి గోపాలకృష్ణ. సమకాలీన సమస్యలపై వెటకారంగా మాట్లాడుతూ గోపాలకృష్ణ సంధించే సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొనేవి. వెకిలిగా నవ్వుతూనే గోతులు తీసే పాత్రల్లోనూ భళా అనిపించారు గోపాలకృష్ణ. ఇప్పటికీ తన దరికి చేరిన చిత్రాలకు రచన చేస్తూ, పాత్రలకు ప్రాణం పోస్తూ సాగుతున్నారు పరుచూరి గోపాలకృష్ణ. 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నా, ఇప్పటికీ మునుపటి ఉత్సాహంతోనే పరుచూరి గోపాలకృష్ణ సాగుతూ ఉండడం విశేషం. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, మరింతగా అలరించాలని ఆశిద్దాం.