చూస్తే భూమికి ఐదున్నర అడుగుల ఎత్తున పీలగా కనిపిస్తాడు. కానీ, మురుగదాస్ పవర్ ఏంటో ఆయన సినిమాలే చెబుతాయి. తెలుగువారిని ‘గజిని’ అనువాదచిత్రంతో ఆకట్టుకున్న మురుగదాస్ తరువాత చిరంజీవితో ‘స్టాలిన్’ తెరకెక్కించి అలరించారు. మహేశ్ బాబుతో ‘స్పైడర్’ తీసి మురిపించారు. ఇక హిందీలోనూ తొలి చిత్రం ‘గజిని’తోనే బంపర్ హిట్ పట్టేశారు. దేశంలో తొలిసారి వంద కోట్ల క్లబ్ కు తెరతీసిన చిత్రంగా హిందీ ‘గజిని’ నిలచింది. విజయ్ హీరోగా హ్యాట్రిక్ కొట్టేశారు మురుగదాస్. గత సంవత్సరం రజనీకాంత్ తో ‘దర్బార్’ రూపొందించిన మురుగదాస్ మరో చిత్రంతో జనాన్ని ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
మురుగదాస్ 1974 సెప్టెంబర్ 25న సేలమ్ సమీపంలోని అత్తూర్ లో జన్మించారు. తండ్రి పేరు అరుణాచలం. అందువల్ల ఎ.ఆర్. అన్నది తన పేరు ముందు పెట్టుకున్నారు మురుగదాస్. తిరుచ్చిలోని బిషప్ హెబర్ కాలేజ్ లో బి.ఏ., చదివిన మురుగదాస్ చదువుకొనే రోజుల్లోనే స్కెచ్ కామెడీస్ రాసి ప్రదర్శించేవారు. పట్టా పుచ్చుకున్నాక మద్రాస్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరాలని ప్రయత్నించారు. అయితే అందులో సీట్ లభించలేదు. దాంతో చెన్నైలోనే చక్కర్లు కొడుతూ సినిమారంగంలో అడుగుపెట్టడానికి తపించారు. ఆ సమయంలో పి.కళై మణి వద్ద అసోసియేట్ గా చేరి, ‘మధురై మీనాక్షి’ చిత్రానికి మాటలు రాశారు. తరువాత నాగార్జున హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘రచ్చగన్’కు దర్శకుడు ప్రవీణ్ గాంధీ వద్ద అసోసియేట్ గా చేశారు. ఆ సమయంలోనే వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘కలిసుందాం రా’ తెలుగు చిత్రానికి దర్శకుడు ఉదయ్ శంకర్ తో కలసి స్క్రిప్ట్ లో పాలు పంచుకున్నారు. తరువాత ఎస్.జె.సూర్య ‘ఖుషి’ తమిళ చిత్రానికీ సహకరించారు. ఇలా సాగిన మురుగదాస్ ను ఎస్.జె.సూర్య హీరో అజిత్ కుమార్ కు పరిచయం చేశారు. మురగదాస్ చెప్పిన ‘దీనా’ కథ అజిత్ కు నచ్చింది. దాంతో అజిత్ హీరోగా ‘దీనా’ వెలుగు చూసింది, మురుగదాస్ దర్శకుడై పోయారు.
మురుగదాస్ తన కథల్లో సగటు మనిషి ఎదుర్కొనే కష్టాలను చర్చిస్తూ ఉంటారు. దాంతో పాటు కథను వైవిధ్యంగా నడపుతూ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా విజయ్ కాంత్ తో ‘రమణ’ తెరకెక్కించారు. అదే సినిమా తెలుగులో చిరంజీవి హీరోగా ‘ఠాగూర్’ పేరుతో రీమేక్ అయి, సంచలన విజయం సాధించింది. మురుగదాస్ మూడో సినిమా సూర్య ‘గజిని’. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. తెలుగులో చిరంజీవి హీరోగా ‘స్టాలిన్’ తెరకెక్కించారు. అందులోనూ సామాజిక సేవను చొప్పించారు. అయితే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమిర్ ఖాన్ తో హిందీలో ‘గజినీ’ రీమేక్ చేయగా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలచింది. అక్కడ నుంచీ మురుగదాస్ జైత్రయాత్ర కొనసాగింది. ఆయన చిత్రాలు ఎలా ఉన్నా సరే చూడాలన్న ఆసక్తి జనాల్లో కలిగించారు. విజయ్ తో మురుగదాస్ తెరకెక్కించిన ‘తుపాకి, కత్తి, సర్కార్’ మూడు చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. ‘కత్తి’ ఆధారంగానే చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ రూపొందింది. మహేశ్ బాబుతో మురుగదాస్ తీసిన ‘స్పైడర్’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. రజనీకాంత్ తో తెరకెక్కించిన ‘దర్బార్’ సైతం ఆశించినంతగా అలరించలేదు.
మురుగదాస్ కు ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ అంటే ఎంతో అభిమానం. ఆయనలాగే తాను దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఏదో ఒక పాత్రలో తెరపై కనిపించాలని మురుగదాస్ ఆశిస్తారు. అలా “సెవెంత్ సెన్స్, తుపాకీ, కత్తి, సర్కార్” వంటి చిత్రాలలో మురుగదాస్ తెరపై తళుక్కుమన్నారు. తెలుగు హీరో విజయ్ దేవరకొండతో మురుగదాస్ అసోసియేట్ ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ‘నోటా’లోనూ మురుగదాస్ కాసేపు తెరపై కనిపించారు. ఏది ఏమైనా మరో చిత్రంతో జనాన్ని ఆకట్టుకోవాలని మురుగదాస్ తపిస్తున్నారు. ఆ తపనలో ఏ తరహా కథను జనానికి అందిస్తారో చూడాలి.