Site icon NTV Telugu

Santhosh Shobhan: సంక్రాంతికే యంగ్ హీరో కళ్యాణం… కమనీయం!

Kalyanam

Kalyanam

Kalyanam Kamaneeyam: వచ్చే సంక్రాంతికి రాబోతున్న సినిమాల జాబితా నిదానంగా పెరిగిపోతోంది. చిరంజీవి, బాలకృష్ణ స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు అజిత్, విజయ్ తమిళ అనువాద చిత్రాలు బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తాయని మొన్నటి వరకూ అనుకున్నాం. అయితే… ఈ పెద్ద సినిమాలతో పాటే చిన్న సినిమాలూ సందట్లో సడేమియా అన్నట్టు సంక్రాంతి సీజన్ ను ఏదో ఒక మేరకు క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నాయి. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ‘విద్య వాసుల అహం’ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోందనే వార్త మొన్ననే వచ్చింది. ఇప్పుడు మరో చిన్న సినిమా సైతం సంక్రాంతి సీజన్ లో రాబోతోందట. అదే సంతోష్ శోభన్, ప్రియ భవాని శంకర్ మూవీ.

యూవీ కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న ‘కళ్యాణం కమనీయం’లో సంతోష్ శోభన్, తమిళ కథానాయిక ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. ఈ మూవీతో అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రవణ్‌ భరద్వాజ సంగీతం అందించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ వీడియో ద్వారా తెలియచేశారు. యూవీ సంస్థలో నిర్మించిన గత చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’లోనూ సంతోష్‌ శోభన్ హీరోగా నటించాడు. ఆ బ్యానర్ అతనితోనే మరో సినిమా కూడా నిర్మిస్తోంది. అలానే సంతోష్‌ శోభన్ హీరోగా నటించిన ‘అన్ని మంచిశకునములే’ చిత్రమూ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో సంక్రాంతి సినిమాల జాబితా ఇంకా పెరుగుతుందేమో చూడాలి.

Exit mobile version