Tinnu Anand: ఈ యేడాది నిజంగా జనం మెచ్చిన సినిమాలు ఎన్ని వచ్చాయో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాటిలో వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన ‘సీతారామమ్’ కూడా చోటు సంపాదించింది. ఈ చిత్రాన్ని చూసిన వారికి అందులో అసలు కథను మలుపు తిప్పే ఆనంద్ మెహతా పాత్ర గుర్తుండే ఉంటుంది. అతని కారును విద్వేషంతో రష్మిక మందన్న పాత్ర కాల్చి వేస్తుంది. ఆమె చదివే కాలేజ్ కు ఆనంద్ మెహతా దాత. ఇంతగా వివరించి చెప్పాక ఆ పాత్రధారిని కొందరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. బాలీవుడ్ సినీ నటదర్శకరచయిత టిన్నూ ఆనంద్ ఆయన! తెలుగువారితోనూ తెలుగు సినిమాలతోనూ ఆయనకు అనుబంధం ఉంది.
టిన్నూ ఆనంద్ 1945 అక్టోబర్ 12న జన్మించారు. ఆయన అసలు పేరు వీరేందర్ రాజ్ ఆనంద్. టిన్నూ తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ హిందీ చిత్రసీమలో చేయితిరిగిన రచయిత. రాజ్ కపూర్ అనేక క్లాసిక్స్ కు ఆయన రచన చేశారు. ఇందర్ రాజ్ ఆనంద్ కు విఖ్యాత బెంగాలీ చిత్రదర్శకులు సత్యజిత్ రాయ్ తో మంచి స్నేహబంధం ఉంది. టిన్నూ చదువు అజ్మీర్ లోని మయో కాలేజ్ లో సాగింది. తండ్రి చిత్రసీమలో రాణిస్తూ ఉండడంతో టిన్నూ మనసు సైతం సినిమా రంగంవైపే పరుగులు తీసింది. టిన్నూ వేషాల వేటలో ఉన్న సమయంలో అమితాబ్ బచ్చన్ కూడా నటనలో రాణించాలని ప్రయత్నాలు చేస్తూండేవారు. కె.ఎ.అబ్బాస్ అదే సమయంలో ‘సాత్ హిందుస్థానీ’ చిత్రం రూపొందిస్తున్నారు. అందులో కవి స్నేహితునిగా టిన్నూను ఎంచుకున్నారు. సరిగా అప్పుడే టిన్నూ తండ్రి ఇందర్ రాజ్ అభ్యర్థన మేరకు సత్యజిత్ రే తన వద్ద పనిచేయడానికి టిన్నూకు అవకాశం ఇచ్చారు. దాంతో మరో మాట లేకుండా టిన్నూ బెంగాల్ వెళ్ళారు. ‘సాత్ హిందుస్థానీ’లో ఆయన ధరించవలసిన పాత్ర అమితాబ్ బచ్చన్ కు దక్కింది. అదే అమితాబ్ తొలి చిత్రం కావడం విశేషం! సత్యజిత్ రే వద్ద ఐదు సంవత్సరాలు ఐదు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు టిన్నూ ఆనంద్. రే రూపొందించిన “గూపీ గైనే బఘా బైనే, అరన్యేర్ దిన్ రాత్రి, ప్రతిద్వంది, సీమబద్ధ, అషనీ సంకేత్” చిత్రాలకు పనిచేస్తూనే టిన్నూ దర్శకత్వంలో అనేక మెలకువలు తెలుసుకున్నారు. ఆ తరువాత హిందీ చిత్రసీమకు మళ్ళీ వచ్చి, ఈ సారి దర్శకునిగా ప్రయత్నాలు మొదలెట్టారు. శశికపూర్, రిషి కపూర్ కాంబోలో ‘దునియా మేరీ జేబ్ మే’ సినిమా తెరకెక్కించారు టిన్నూ. ఈ సినిమాతో టిన్నూకు దర్శకునిగా మంచి మార్కులు లభించాయి.
అమితాబ్ బచ్చన్ హీరోగా ‘కాలియా’ చిత్రాన్ని రూపొందించారు టిన్నూ ఆనంద్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత టిన్నూ తెరకెక్కించిన ‘యే ఇష్క్ నహీ ఆసాన్’ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. మళ్ళీ మిత్రుడు అమితాబ్ తో ‘షెహెన్షా’ తీశారు టిన్నూ. అదీ అంతగా అలరించలేదు. అమితాబ్ తోనే ‘మై ఆజాద్ హూ’, ‘మేజర్ సాబ్’ సినిమాలనూ రూపొందించారు. సునీల్ శెట్టితో ‘ఏక్ హిందుస్థానీ’ అనే చిత్రాన్ని చివరగా తన దర్శకత్వంలో తెరకెక్కించారు టిన్నూ. ఓ వైపు దర్శకునిగా సాగుతూనే నటునిగా అవకాశాలు వస్తే చక్కగా వినియోగించుకున్నారు టిన్ను. సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన మూకీ చిత్రం ‘పుష్పక్’లో ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రలో కాసేపు వినోదం పండించారు టిన్ను. ఆ తరువాత మణిరత్నం ‘నాయకన్’లోనూ విలక్షణమైన పాత్రలో అలరించారు. ‘అగ్నిపథ్’లో నాథూ పాత్రలోనూ మురిపించారు. బాలకృష్ణ, సింగీతం కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘ఆదిత్య 369’లో ప్రొఫెసర్ రామ్ దాస్ గానూ నటించి ఆకట్టుకున్నారు. ఓ వైపు ఉత్తరాది సినిమాల్లో నటిస్తూనే దక్షిణాది అన్ని భాషల్లోనూ తనదైన అభినయం ప్రదర్శించారు టిన్నూ ఆనంద్. ఆయన నటించిన పరభాషా చిత్రాలు తెలుగులోనూ అనువాదమై అలరించాయి.
టిన్నూ ఆనంద్ ప్రముఖ నటుడు ఆఘా కూతురు షెహనాజ్ ను వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. ప్రముఖ హిందీ హాస్యనటుడు జలాల్ ఆఘా స్వయానా బావమరిది. టిన్నూ సోదరుడు బిట్టూ ఆనంద్ కుమారుడే ప్రముఖ యువ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఈయన దర్శకత్వంలోనే “కుచ్ కట్టీ కుచ్ మీఠీ, హమ్ తుమ్, వార్” చిత్రాలు రూపొందాయి. సిద్ధార్థ్ డైరెక్షన్ లోనే షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘పఠాన్’ తెరకెక్కుతోంది.
చిరంజీవి ‘అంజి’, ప్రభాస్ ‘సాహో’లోనూ టిన్నూ ఆనంద్ నటించారు . వైజయంతీ మూవీస్ దుల్కర్ సల్మాన్ తో రూపొందించిన ‘సీతారామమ్’లో ఆనంద్ మెహతాగా కాసేపు కనిపించినా తనదైన అభినయంతో అలరించారు టిన్ను. అక్టోబర్ 12తో 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న టిన్నూ ఆనంద్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
