‘మొగలి రేకులు’ సీరియల్‌తో బుల్లితెరపై తిరుగులేని గుర్తింపును సాగర్ (ఆర్.కె నాయుడు) సంపాదించుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం ‘షాదీ ముబారక్’ ఈ యేడాది మార్చిలో విడుదలైంది. ప్రస్తుతం సాగర్ (ఆర్.కె. నాయుడు) ‘100’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమా ఉంటుందని, ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలని చెప్పే చిత్రమిదని సాగర్ అన్నాడు. ‘మొగలి రేకులు’ సీరియల్‌లోని ఆర్. కె. నాయుడును మరపించే పోలీస్ పాత్ర కోసం చాలా రోజులుగా ఎదురుచూశానని, అలాంటి శక్తివంతమైన పాత్ర ఈ సినిమాలో దొరికిందని, ఇందులో విక్రాంత్ అనే పోలీస్ అధికారిగా వినూత్నమైన క్యారెక్టరైజేషన్‌తో తాను కనిపించబోతున్నానని సాగర్ చెప్పాడు.
Read Also : కాదేదీ లీకులకు అనర్హం!
నిజానికి ఈ సినిమాను సుకుమార్ ప్రొడక్షన్స్ లో చేయాల్సిందని, కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతుండటంతో స్వీయ నిర్మాణ సంస్థ ఆర్.కె. మీడియా వర్క్స్ పై దీనిని నిర్మిస్తున్నానని సాగర్ అన్నాడు. ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు కానుంది. గతంలో మాదిరి ఇకపై గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయబోతున్నాడట సాగర్. అందులో భాగంగానే ‘100’ మూవీతో పాటు మరో రెండు సినిమాలనూ చేయబోతున్నట్టు చెప్పాడు. స్పై థ్రిల్లర్ జోనర్‌తో పాటు కుటుంబ కథాంశంతో ఈ సినిమాలు తెరకెక్కుతాయని, ఈ మూడు సినిమాల మీదనే ప్రస్తుతం తాను దృష్టి పెట్టానని సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా సాగర్ తెలిపాడు.
