NTV Telugu Site icon

This Weekend Movies: ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ ఇవే!

Tpr123

Tpr123

Tollywood: మార్చి ఫస్ట్ వీకెండ్ లో ఏడు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. అయితే అందులో బడ్జెట్ పరంగా భారీ చిత్రాలేవీ లేవు. అయితే, ఇవన్నీ కూడా విభిన్న కథాంశాలున్న చిత్రాలు. ఇందులో చెప్పుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. కోనేరు కల్పన ఈ సినిమాను కె. అచ్చిరెడ్డి సమర్పణలో నిర్మించారు. రాజేందప్రసాద్, మీనా, సోహైల్, మృణాళిని రవితో పాటుగా పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో యాక్ట్ చేశారు. కథ, కథనం, సంగీతం, దర్శకత్వంతో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాకు సంభాషణలు సైతం సమకూర్చడం విశేషం. ఇక కమెడియన్ వేణు ఎల్దండి తొలిసారి మెగా ఫోన్ చేతపట్టి తీసిన సినిమా ‘బలగం’. దీన్ని ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ మీద శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించారు. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలంగాణ పల్లె నేపథ్యంలో మానవ సంబంధాల మీద ‘బలగం’ చిత్రం రూపుదిద్దుకుంది. ఖమ్మంలోని క్షురకురాలి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సాచి’. వివేక్ పోతగోని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో సంజన రెడ్డి, గీతిక రథన్, చెల్లి స్వప్న, అశోక్ రెడ్డి, మూలవిరాట్, టీవీ రామన్, ఏవీఎప్ ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఓ కారులో మహిళపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో నిజ సంఘటన ఆధారంగా ‘ఇన్ కార్’ మూవీ తెరకెక్కింది. జాతీయ ఉత్తమనటిగా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న రిషికా సింగ్ ఇందులో ప్రధాన పాత్రను పోషించింది. అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా 3న విడుదల చేయబోతున్నారు. సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గ్రంథాలయం’. విన్ను మద్దిపాటి, స్మిత రాణి బోర, ‘కాలికేయ’ ప్రభాకర్‌, కాశీ విశ్వనాథ్‌, డా. భద్రం, సోనియా చౌదరి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కూడా శుక్రవారమే వస్తోంది. వీటితో పాటే మలయాళ చిత్రం ‘ట్వల్త్ మేన్’ ఆధారంగా రూపొందిన ‘రిచిగాడి పెళ్ళి’ సినిమా విడుదల కానుంది. నవీన్ నేని, బన్నీ వోక్స్, చందన రాజ్, ప్రణీత పట్నాయక్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అలానే ఓ ఆంగ్ల చిత్రం ఆధారంగా యేలూరి సురేందర్ రెడ్డి ‘బిగ్ స్నేక్ కింగ్’మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఆ రకంగా వైవిధ్యభరితమైన ఏడు సినిమాలు ఈ వారంతంలో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వీటిలో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.