ప్రముఖ తమిళ నటుడు వివేక్ ఈ యేడాది ఏప్రిల్ 17వ తేదీ హఠాన్మరణం చెందారు. కమెడియన్ గా, సహృదయుడిగా చక్కని పేరు తెచ్చుకున్న వివేక్ మరణంతో తమిళ చిత్రసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దానికి కారణం ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు కొవిడ్ 19కు వాక్సిన్ వేయించుకోవడమే! ఆయన మరణానికి వాక్సిన్ వేయించుకోవడం కారణం కాదని ఆరోగ్యశాఖ అప్పుడే వివరణ ఇచ్చింది. అయినా కొన్ని మీడియా సంస్థలు వాక్సిన్ వికటించి వివేక్ మరణించారంటూ ముమ్మరంగా ప్రచారం చేశాయి.
Read Also : షూటింగ్ లో కాల్పులు… సినిమాటోగ్రాఫర్ కన్నుమూత!
ఈ విషయంలో నిజానిజాల నిగ్గు తేల్చడానికి విల్లుపురంకు చెందిన సామాజిక కార్యకర్త ఎన్. ఎస్. శరవణన్ పూనుకున్నారు. వివేక్ హఠాన్మరణానికి అసలైన కారణం తెలియచేయమంటూ ఆయన ఎన్.హెచ్.ఆర్.సి.లో ఫిర్యాదు చేశారు. దాంతో ఎన్.హెచ్.ఆర్.సి. ఈ ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖకు పంపింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వేక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ శాఖ ఆ ఫిర్యాదును పరిశీలించి, తాజాగా వివేక్ మరణానికి కారణాలను తెలియచేస్తూ ఓ నివేదికను విడుదల చేసింది. అధిక రక్తపోటు, కార్డియాక్ అరెస్ట్ కారణంగా వివేక్ మరణించారని, ఆయన చనిపోవడానికి వాక్సిన్ కు ఎలాంటి సంబంధంలేదని ఆ నివేదికలో పేర్కొంది.
