ఈ ఏడాది సినీ పరిశ్రమకు భారీ అంచనాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కొన్ని పెద్ద సినిమాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకుని థియేటర్లలోకి వచ్చిన చిత్రాలు కలెక్షన్ల పరంగా దారుణంగా విఫలమై కొనుగోలుదారులకు కోట్లలో నష్టాలను మిగిల్చాయి. ఇటీవల విడుదలైన చిత్రాల్లో కన్నడ సూపర్ స్టార్ యష్ ‘టాక్సిక్’ ఎదుర్కొన్న డిజాస్టర్ టాక్‌కు ధీటుగా కార్తీ నటించిన ‘సర్దార్ 2’ నిలిచి ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద ప్లాప్‌గా నమోదైంది.
ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ హక్కులను రూ. 35 కోట్లకు విక్రయించగా, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 9.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే రూ. 8 కోట్లకు హక్కులు కొనుగోలు చేయగా కేవలం రూ. 2.50 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అటు కన్నడలో అత్యంత భారీ బిజినెస్ జరుపుకున్న ‘టాక్సిక్’ రూ. 450 కోట్ల థియేట్రికల్ టార్గెట్‌తో బరిలోకి దిగగా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 160 కోట్ల వద్దే ఆగిపోయి బయ్యర్లకు కోలుకోలేని దెబ్బ తీసింది.
కేవలం ఈ రెండు చిత్రాలే కాకుండా, తెలుగులో కూడా స్టార్ హీరోల చిత్రాలు బయ్యర్లకు ఊహించని షాక్ ఇచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ. 130 కోట్లకు అమ్ముడవగా, థియేటర్లలో కేవలం రూ. 60 కోట్లు మాత్రమే రాబట్టి సగానికి పైగా నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ బిజినెస్ రూ. 122 కోట్లు జరగగా వసూళ్లు రూ. 87 కోట్ల వద్దే క్లోజ్ అయి బయ్యర్లకు డిజాస్టర్ రిజల్ట్‌ను ఇచ్చాయి.

