The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!

The Paradise

The Paradise

తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్రమోషన్ అంటేనే ట్రైలర్ లాంచ్. కానీ దసరా కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విషయంలో చిత్ర యూనిట్ అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సినిమా విడుదలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అసలు ట్రైలర్ విడుదల చేయడం లేదని స్వయంగా హీరో నాని ప్రెస్ మీట్ వేదికగా తేల్చి చెప్పారు. పెద్ద సినిమాలకు రిలీజ్‌కు ముందు ట్రైలర్ ద్వారానే బజ్ పెంచడం ఆనవాయితీ కాగా, అసలు ట్రైలరే లేకుండా సినిమాను థియేటర్లలోకి దించుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ప్రెస్ మీట్‌లో మీడియా ప్రతినిధులు ట్రైలర్ గురించి ప్రశ్నించగా నాని పూర్తి స్పష్టత ఇచ్చారు.

ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరిస్తూ, “ఇది ఏమాత్రం ప్రేక్షకుల ఆదరణను గ్రాంటెడ్ గా తీసుకోవడం కాదు. సినిమాపై ఉన్న విపరీతమైన హైప్, బజ్‌ను చూసి గర్వంతో తీసుకున్న నిర్ణయం అంతకన్నా కాదు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ఔట్‌పుట్ నాణ్యత కోసం కొన్ని టీమ్స్ రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. మీకు ఒక అదిరిపోయే ట్రైలర్ కట్ చేసి ఇవ్వాలంటే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సహా కీలక సాంకేతిక నిపుణులంతా నాలుగైదు రోజుల పాటు సినిమా ప్రధాన పనులను పక్కన పెట్టాల్సి వస్తుంది. సినిమా కంటే ట్రైలర్ ముఖ్యం కాదు కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లోనే ట్రైలర్ తీసుకురాకూడదని యూనిట్ మొత్తం నిర్ణయించాం” అని స్పష్టం చేశారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కాయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ప్రమోషన్ లేకుండానే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.