Oscars: ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఎఎమ్.పిఏఎస్) అంటే అందరికీ తెలియక పోవచ్చు. కానీ, వాటిని ‘ఆస్కార్ అవార్డ్స్’ అంటారని సినీ ఫ్యాన్స్ కు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. వచ్చే సంవత్సరం మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి శనివారం (నవంబర్ 19న) తెర లేచిందనే చెప్పాలి. ఆస్కార్ అవార్డులు అనగానే అత్యుత్తమంగా నిలచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రదానం చేసే అవార్డులే అని భావిస్తారు. నిజానికి అవే ప్రధానమైన అవార్డులు. అయితే వీటితో పాటు మరో నాలుగు రకాల అవార్డులనూ ఎఎమ్.పిఏఎస్ ప్రదానం చేస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటిది ‘గవర్నర్స్ అవార్డ్స్’. వాస్తవానికి నవంబర్ 15తో నామినేషన్స్ ఎంట్రీకై పలువురు అప్లై చేసుకున్నారు. అలా ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రయత్నిస్తున్న చిత్రాలలో మన దేశానికి చెందిన తెలుగు బ్లాక్ బస్టర్ ‘ట్రిపుల్ ఆర్’తో పాటు భారతదేశం అధికారికంగా ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’ కేటగిరీలో నామినేషన్ కోసం ఎంపిక చేసిన గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ (ద లాస్ట్ షో) కూడా ఉంది.
ప్రతి యేడాది నవంబర్ ప్రథమార్ధానికి నామినేషన్స్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ముగుస్తూ ఉంటాయి. దాని తరువాత ఆస్కార్ లో సాగే ఐదు అవార్డుల ప్రదానోత్సవాలు మొదలవుతాయి. అన్నిటికన్నా ముందుగా ‘గవర్నర్స్ అవార్డ్స్’ నవంబర్ ద్వితీయార్ధం లేదా డిసెంబర్ ప్రథమార్ధంలో సాగుతూ ఉంటాయి. ఈ సారి నవంబర్ 19నే ఈ ‘గవర్నర్ అవార్డ్స్’ కార్యక్రమం సాగింది. దాంతో ఆశావహులందరిలోనూ ఆసక్తి మొదలయింది.
ఇంతకూ ఆస్కార్ లో సాగే ఐదు అవార్డు పండగలు ఏవంటే, మొదటిది ఈ ‘గవర్నర్స్ అవార్డ్స్’ కాగా, రెండవది ‘అకాడమీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డ్స్’, మూడోది ‘స్టూడెంట్స్ అకాడమీ అవార్డ్స్’, నాలుగోది ప్రధానమైనది సినిమాలకు ఇచ్చే ‘ఆస్కార్ అవార్డ్స్’, ఐదో అవార్డు ‘అకాడమీ ఆనరరీ అవార్డు’. మిగిలిన నాలుగు రకాల అవార్డ్స్ ను మెయిన్ అవార్డ్స్ అయిన సినిమాలతో పాటే ప్రదానం చేయవచ్చు. లేదా అటు ఇటుగా ఆ వేడుకలు సాగవచ్చు. ముందుగా సాగే ‘గవర్నర్స్ అవార్డ్స్’తోనే ఉత్సాహం ఊపందుకుంటుంది.
ఈ సారి డిసెంబర్ 21న ఆస్కార్ షార్ట్ లిస్ట్స్ ప్రకటిస్తారు. 2023 జనవరి 24 నాటికి ఓటింగ్ మొత్తం పూర్తయి ఏ యే చిత్రాలు, ఎవరెవరు నటీనటులు, ఏ సాంకేతిక నిపుణులు నామినేషన్స్ సంపాదించింది తెలిసిపోతుంది. మార్చి 2 నుండి 7 వరకు ఫైనల్ ఓటింగ్ సాగుతుంది. అందులో అత్యధిక ఓట్లు సంపాదించిన వారు విజేతలుగా నిలుస్తారు. ఆ పేర్లు మాత్రం షీల్డ్ కవర్స్ లో నిక్షిప్తమై 2023 మార్చి 12న ఆదివారం సాయంత్రం సాగే అవార్డుల ప్రదానోత్సవంలోనే ఎవరు విన్నర్స్ అన్నదీ తేలిపోతుంది. అప్పటి దాకా మన దగ్గర అంతగా ఉండదు కానీ, అమెరికా, బ్రిటన్ దేశాల్లో మాత్రం మీడియాల్లో భలే ఊహాగానాలు చోటు చేసుకుంటూ సందడి సాగుతుంది. కొన్నిసార్లు ఈ ఊహాగానాలే నిజమైన సందర్భాలూ ఉన్నాయి. మరి మన ‘ట్రిపుల్ ఆర్’కు ఏ యే కేటగిరీల్లో నామినేషన్స్ దక్కుతాయో తేలాలంటే జనవరి 24 దాకా ఆగాల్సిందే!