Tollywood Senior Heroes:తెలుగు చిత్రసీమలో ‘నట పంచపాండవులు’గా పేరొందిన యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు అందరూ వందలాది చిత్రాల్లో నటించారు. వీరందరూ ఒకప్పుడు రోజుకు రెండు లేదా మూడు షిఫ్టులలో పనిచేసినవారే! వీరందరూ ఏడు పదులకు పైగా జీవితం చూసిన వారే కావడం విశేషం! ఈ ఐదుగురిలోకి అందరికంటే వయసులో యన్టీఆర్ పెద్దవారు కాగా, అందరిలోకి చిన్నవారు కృష్ణ!
ఇక వీరు ఈ నేలపై సాగిన తీరును పరిశీలిస్తే 1923 మే 28న జన్మించిన యన్టీఆర్ 1996 జనవరి 18న పరమపదించారు. మొత్తం 72 సంవత్సరాల 7 నెలల 21 రోజులు యన్టీఆర్ జీవితకాలంగా చెప్పవచ్చు. 1924 సెప్టెంబర్ 20న జన్మించిన ఏయన్నార్ 2014 జనవరి 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జీవించిన కాలం 89 సంవత్సరాల 4 నెలల 2 రోజులు. శోభన్ బాబు 1937 జనవరి 14న జన్మించి, 2008 మార్చి 20న తనువు చాలించారు. ఆయన 71 సంవత్సరాల 2 నెలల 6 రోజులు జీవించారు. కృష్ణంరాజు 1940 జనవరి 20న కన్ను తెరచి, 2022 సెప్టెంబర్ 11న కన్నుమూశారు. ఆయన 82 సంవత్సరాల 7 నెలల 22 రోజులు నడయాడారు. 1943 మే 31న జన్మించిన కృష్ణ, 2022 నవంబర్ 15న మరణించారు. ఆయన మొత్తం జీవితకాలం 79 సంవత్సరాల 5 నెలల 15 రోజులు.
ఈ నటపంచపాండవులులో అందరికంటే ఎక్కువ కాలం ఏయన్నార్ జీవించగా, అందరిలోకి తక్కువ రోజులు చూసినవారు శోభన్ బాబు. బాక్సాఫీస్ బరిలో పోటాపోటీగా సాగిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ జనవరి మాసంలోనే కన్నుమూయడం విశేషం! యన్టీఆర్ పరమపదించిన దాదాపు 18 ఏళ్ళకు ఏయన్నార్ మరణించారు. ఇక శోభన్ బాబుతో పలుమార్లు ఢీ కొన్న కృష్ణ ఆయన తరువాత 14 ఏళ్ళకు తుదిశ్వాస విడిచారు. ఏయన్నార్ తరువాత కృష్ణంరాజు కూడా ఎనభై ఏళ్ళకు పైగా జీవించారు. కృష్ణంరాజు, కృష్ణ ఒకే యేడాది 2 నెలల 4రోజుల వ్యవధిలో కన్నుమూయడం గమనార్హం!
