మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కావాల్సింది. అయితే ఆ సమయంలో కొవిడ్ 19 కేసులు ఎక్కువ ఉండటం, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలలో వీకెండ్ లాక్ డౌన్ పెట్టడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి తెలిపారు. అయితే మార్చి 10న సూర్య నటించిన ‘ఈటీ’ మూవీ పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఆ మర్నాడే అంటే మార్చి 11న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ సైతం గ్రాండ్ వేలో వరల్డ్ వైజ్ రిలీజ్ కు సిద్ధమౌతోంది.
కథ రీత్యా ఈ రెండు సినిమాలు ‘ది కాశ్మీర్ ఫైల్స్’కు పూర్తి భిన్నమైనవే అయినా… ఆ పాన్ ఇండియా మూవీస్ మధ్య ఈ ఆలోచనాత్మక చిత్రానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందనే సందేహమైతే కొందరు వ్యక్తం చేస్తున్నారు. దేశ స్వాతంత్రానంతరం కాశ్మీర్ లోయలోని హిందూ పండిట్ల వెతల నేపథ్యంలో ‘ది కాశ్మీర్ ఫైల్’ చిత్రం రూపుదిద్దుకుంది. దీనిని వివేక్ అగ్రిహోత్రితో కలిసి పల్లవి జోషి, తేజ్ నారాయణ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. జీ స్టూడియోస్ సైతం ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
