Tax Free on The Kashmir Files Movie at Karnataka Also.
అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవిజోషి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమాకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు కంటే ఆదివారానికి మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూళ్ళు సాధించింది. మొత్తం మీద వీకెండ్ లో ఈ మూవీకి రూ. 31.6 కోట్ల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 1990 సంవత్సరంలో ఓ పథకం ప్రకారం కశ్మీర్ లోయలోని పండిట్స్ పై దాడి చేసి మారణహోమం సృష్టించారు. దాంతో భయభ్రాంతులకు గురైన దాదాపు ఐదు లక్షల మంది పండిట్స్ కశ్మీర్ లోయను వీడి ఢిల్లీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు వలస పోయారు. స్వదేశంలోనే వారు కాందిశీకులైపోయారు.
అప్పటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఈ అమానవీయ సంఘటనపై పెదవి విప్పలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి స్థానిక ముస్లింలు కశ్మీరీ పండిట్లతో ఎంత దారుణంగా వ్యవహరించారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. దాంతో సహజంగానే బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ చిత్రానికి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు వినోద పన్ను రాయితీ ప్రకటించాయి. తాజాగా ఈ సినిమాను చూసిన కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ‘ఇది అందరూ చూడాల్సిన సినిమా’ అని కితాబిస్తూ తమ రాష్ట్రంలోనూ వినోదపు పన్ను మినహా ఇస్తున్నట్టు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో మిగిలిన బీజేపీ రాష్ట్రాలలోనూ ఈ సినిమాకు పరోక్ష సాయం లభించే ఆస్కారం ఉంది.
