NTV Telugu Site icon

The Ghost: అక్టోబర్ 5 నాగ్ ఫ్యాన్స్ కు డబుల్ థమాకా!

The Ghost

The Ghost

 

ఈ యేడాది అక్టోబర్ 5వ తేదీ కింగ్ నాగార్జున అభిమానులకు డబుల్ థమాకా అనుకోవచ్చు. నాగార్జున లేటెస్ట్ మూవీ అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం అదే తేదీని నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘శివ’ విడుదలైంది. ఈ విషయాన్ని ‘ది ఘోస్ట్’ మూవీ నిర్మాతల్లో ఒకరైన శరత్ మరార్ తెలిపారు. శనివారం ఏఎంబీలో ‘ది ఘోస్ట్’ మూవీ కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్ గా కనిపించారు. యువ సంగీత దర్శకులు భరత్ – సౌరభ్ ఇచ్చిన బీజీయం ఈ గ్లిమ్ప్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది. కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ‘ది ఘోస్ట్’ పై మరిన్ని భారీ అంచనాలు పెంచింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జునతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్, నటులు మహేంద్ర, క్రిష్, రవి వర్మ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు పాల్గొన్నారు.

మీడియాలో నాగార్జున మాట్లాడుతూ, ”ఈ మూవీలో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా వుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. సునీల్ నారంగ్ గారి నాన్నగారు నారాయణ్ దాస్ నారంగ్ తో ఈ సినిమా చేయాలనే ఆలోచన మొదలైయింది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లాంటి మంచి అభిరుచి గల నిర్మాతలు కలసి సినిమా అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వుంటాయి. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు ఎమోషన్ , సిస్టర్ సెంటిమెంట్ కూడా వుంటుంది” అని అన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ, ”నాగార్జునతో సినిమా చేసే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. నాగార్జున స్టైలిష్ యాక్షన్ లో అద్భుతంగా వుంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది. సినిమా మొదలైన తర్వాత కరోనా రూపంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఐతే మా నిర్మాతలుగొప్ప సపోర్ట్ గా నిలబడ్డారు” అని చెప్పారు.

నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.