Brahmastra: ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం సినీ, రాజకీయ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర రాజకీయంపై చర్చ నడుస్తోంది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇక ఈ వేడుకకు ఎన్టీఆర్ గెస్టుగా రానున్న సంగతి కూడా తెల్సిందే. అయితే అంతా అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే ఈవెంట్ స్టార్ట్ అయ్యిపోయి ఉండేది. కానీ, బ్రహ్మాస్త్ర టీమ్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. వినాయక మండపాల బందోబస్తు కారణంగా సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పడంతో ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు మేకర్స్. అయితే ఇక్కడే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
మొదటి నుంచి అన్నీ సెట్ చేసుకొని పర్మిషన్లు తీసుకొని ఇక్కడికి వరకు వచ్చాకా పర్మిషన్ ఇవ్వలేము, ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోండి అని ఎలా చెప్తారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్టుగా రాబోతున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షాను మీట్ అయ్యాడు. ఇక మరోపక్క ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంది రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు ఎంపిక చేసింది బీజేపీనే. ఈ రెండు కారణాల వలనే కొంతమంది రాజకీయ నాయకులు బ్రహ్మాస్త్ర ను అడ్డుకొంటున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్- షా మధ్య ఏం జరిగిందో అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయం. కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారు అంటే మరి ఎన్టీఆర్ తరువాత జేపీ నడ్డా, నితిన్ ను కలవాల్సిన అవసరం ఏం ఉంది.
సినీ ప్రముఖులతో బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుందని అనుమానించిన పలువురు వాటిని అడ్డుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒకవేళ ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ కాకుండా మరెవ్వరు గెస్ట్ గా వచ్చినా ఈవెంట్ ను జరగనిచ్చి ఉండేవారా..? అనేది అంతుచిక్కని ప్రశ్న. ఏదిఏమైనా ఎన్టీఆర్ రాజకీయ సెగ పాపం బాలీవుడ్ బ్రహ్మాస్త్రకు శాపంగా మారిందని అంటున్నారు. హైదరాబాద్ లో ప్రేక్షకుల అభిమానాన్ని చూడడానికి వచ్చిన బాలీవుడ్ బృందానికి తెలుగు రాష్ట్రాల రాజకీయ సెగ చూపించారు అని మరికొందరు అంటున్నారు. మరి ఈ ఈవెంట్ ఎక్కడ ఎప్పుడు పెడతారో చూడాలి.
