The Adventures And Records Of Superstar Krishna: తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్… ఆయనే మొదటి జేమ్స్ బాండ్… ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో… ఆయనే ప్రథమ 70 ఎమ్.ఎమ్. మూవీ డైరెక్టర్ కమ్ హీరో… ఇలా పలు ‘తొలి’ సంఘటనలకు తెలుగు చిత్రసీమలో తెరతీశారు కృష్ణ. తెలుగు చిత్రసీమలో ‘హీరో’ కృష్ణగా, నటశేఖర కృష్ణగా, ఆపై సూపర్ స్టార్ కృష్ణగా సాగారు. డేరింగ్ అండ్ డేషింగ్, డైనమిక్ వంటి పదాలు సైతం హీరో కృష్ణ పేరు ముందు చేరి అలరించాయి. తెలుగునాట 325 పై చిలుకు చిత్రాల్లో నటించిన నటునిగా ఓ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి సాంకేతికంగా సినిమాస్కోప్, టెక్నికలర్ వంటి అంశాలను అందించిన ఘనత కూడా కృష్ణ సొంతం. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు కృష్ణ.
చిత్రసీమ పిలిచింది…
ఘట్టమనేని శివరామకృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతుల తొలి సంతానంగా కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ఆయన తరువాత హనుమంతరావు, ఆదిశేషగిరిరావు సోదరులు. చదువుకొనే రోజుల్లోనే కృష్ణకు నటనపై ఆసక్తి కలిగింది. నాటకాలు వేసేవారు. తరువాత ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కూడా నాటకాలు వేస్తూ సందడి చేశారు. బి.ఎస్సీ చేరాక, అందుకు స్వస్తి పలికి, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు కృష్ణ. ఆరంభంలో ‘పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు- ప్రతిష్ఠ’ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు పోషించారు. అందరూ కొత్తవారితో ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనెమనసులు’ ద్వారా ఇద్దరు హీరోల్లో ఒకరిగా పరిచయం అయ్యారు కృష్ణ. తెలుగునాట రంగుల్లో రూపొందిన తొలి సాంఘిక చిత్రంగా ‘తేనె మనసులు’ నిలచింది. దాంతో జనం భలేగా ఆ సినిమాను ఆదరించారు. కృష్ణకు నటునిగా మంచి గుర్తింపు లభించింది. ఆపై ‘కన్నెమనసులు, గూఢచారి 116’ వంటి సినిమాల్లో నటించి మరింత పేరు సంపాదించారు. ‘గూఢచారి 116’ విజయంతో కృష్ణకు మాస్ హీరోగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అయినా తన సీనియర్ హీరోలు యన్టీఆర్, ఏయన్నార్ సినిమాల్లో కీలక పాత్రలు లభిస్తే ధరించి ఆకట్టుకున్నారు కృష్ణ.
సొంత చిత్రాలతో…
యన్టీఆర్, ఏయన్నార్ లాగే తనకూ ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంటే మేలని భావించిన కృష్ణ ‘పద్మాలయా’ సంస్థను నెలకొల్పి, తొలి ప్రయత్నంగా ‘అగ్నిపరీక్ష’ నిర్మించారు. ఆయన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరి రావు కూడా అన్నకు తోడుగా నిలచి, నిర్మాతలయ్యారు. వీరి తొలిప్రయత్నం ‘అగ్నిపరీక్ష’ పరాజయం పాలయింది. ఆ తరువాత తెలుగులో తొలి కౌబోయ్ మూవీగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిర్మించారు. ఈ రంగుల సినిమా జనాన్ని భలేగా ఆకర్షించింది. ఆ పై “పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు” వంటి సొంత చిత్రాలతో విజయాలు సాధించి, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు కృష్ణ. ఆయన 100వ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’, 200వ చిత్రంగా తెరకెక్కిన ‘ఈనాడు’ మంచి విజయాలు సాధించాయి. 300వ సినిమాగా వచ్చిన ‘తెలుగువీర లేవరా’ అంతగా అలరించలేకపోయింది. ఆ పై కృష్ణ నటించిన చిత్రాలలో ‘నంబర్ వన్’ ఆకట్టుకుంది. పలు చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ లోనూ కృష్ణ మెప్పించారు. తనయుడు రమేశ్ బాబుతో కలసి కృష్ణ నటించిన ‘ఎన్ కౌంటర్’, మహేశ్ బాబుతో కలసి నటించిన ‘వంశీ’ చిత్రాలు అభిమానులకు ఆనందం పంచాయి. కృష్ణ సతీమణి విజయనిర్మల ఆయన సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగా నిలిచారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన ‘మీనా’ చిత్రంలోనూ కృష్ణనే నాయకుడు. ఆ పై భార్య దర్శకత్వంలో పలు సినిమాల్లో కృష్ణ హీరోగా నటించి మెప్పించారు.
కొన్నాళ్ళుగా…
కృష్ణ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సింహాసనం’ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. తెలుగులో తొలి 70 ఎమ్.ఎమ్. చిత్రంగా ‘సింహాసనం’ నిలచింది. ఆ తరువాత “నాగాస్త్రం, ముగ్గురుకొడుకులు, కొడుకు దిద్దిన కాపురం” వంటి హిట్స్ నూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. మొన్నటి దాకా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి తపించేవారు కృష్ణ. ఆయన సతీమణి, నటి విజయనిర్మల మృతి, పెద్దకొడుకు రమేశ్ హఠాన్మరణం, మొదటి భార్య ఇందిర మరణం ఆయనను బాగా కుంగదీశాయి. అప్పటి నుంచీ కృష్ణలోని చలాకీ తనం మాయమయింది. ఎప్పుడూ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ, చుట్టూ ఉన్నవారికి తన పాత జ్ఞాపకాలు చెబుతూ సాగిన కృష్ణ కొద్దిరోజులుగా అనారోగ్యంతోనే ఉన్నారు. ఏది ఏమైనా కృష్ణ పేరు వినగానే అభిమానుల మదిలో ‘సూపర్ స్టార్’ అన్న పదం చిందులు వేస్తుంది. ఆయన నటించిన అనేక మాస్ మూవీస్ వారి మదిలో మెదలుతాయి. చిత్రసీమలో కృష్ణ చేసిన పలు సాహసవిన్యాసాల గురించీ వారు ప్రస్తావించుకొని మురిసిపోతారు.