Thalapathy Vijay : తలపతి బర్త్ డే ట్రీట్ ‘జన నాయగన్’ కాదు… సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Thalapathy Vijay (2)

Thalapathy Vijay (2)

Thalapathy Vijay : విజయ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ వెండితెరపైకి రాబోతోంది. అయితే అది ‘ జన నాయగన్’ కాదు, దర్శకుడు అట్లీ దర్శకత్వంలో, తేనండాల్ పిక్చర్స్ 2017లో నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మెర్సల్’. తమిళ సినీ అభిమానులకు ‘మెర్సల్’ కేవలం ఒక సినిమా కాదు. అది తలపతి విజయ్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన మైలురాయి. విడుదలై దాదాపు తొమ్మిదేళ్లు కావొస్తున్నా, ఆ చిత్రంలోని సన్నివేశాలు, డైలాగులు, పాటలు, ముఖ్యంగా విజయ్ త్రిపాత్రాభినయం ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తలపతి విజయ్ 52వ పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేక కానుకగా ‘మెర్సల్’ రీ రిలీజ్ అవుతున్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

విజయ్ పుట్టినరోజు జూన్ 22న జరగనుండగా, ఆ వేడుకలను మరింత ఘనంగా మార్చేందుకు ‘మెర్సల్’ను జూన్ 19 నుంచే థియేటర్లలో తిరిగి విడుదల చేయనున్నారు. దీంతో అభిమానులకు ఇది ఒక ప్రత్యేక వీకెండ్ ఫెస్టివల్‌గా మారనుంది. సాధారణంగా రీ రిలీజ్‌లు పరిమిత స్థాయిలో జరుగుతుంటాయి. కానీ ‘మెర్సల్’ విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు వంటి కీలక ప్రాంతాల్లో దాదాపు 100 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విడుదలై ఎన్నేళ్లు గడిచినా విజయ్ సినిమాలకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలియజేస్తోంది.

×
×
Ad

దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం 2017లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వైద్య రంగంలో జరుగుతున్న అక్రమాలు, సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలను కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చెప్పిన తీరు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ చిత్రానికి అసలైన బలం విజయ్ పోషించిన మూడు విభిన్న పాత్రలే. ఇంద్రజాలికుడిగా, వైద్యుడిగా, ఆ వైద్యుడి తండ్రిగా ఆయన చూపించిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో నిత్యా మీనన్, సమంత రూత్ ప్రభు, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీత దర్శకుడు A. R. Rahman అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ మూవీ విడుదల సమయంలో ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అప్పటి తమిళ సినీ పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.