‘ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇందులో గొప్పేముంది? ‘మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇది కదా మజా ఇచ్చేది! సినిమా రంగంలో అధిక సంఖ్యాకులు ‘ప్లస్ ఇంటూ ప్లస్’కే జై కొడతారు. కానీ, కొన్నిసార్లు ‘మైనస్ ఇంటూ మైనస్ – ప్లస్’ అవుతుందనీ నిరూపణ అయ్యింది. అలా చేసిన చిత్రాల్లో పదేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా జనం ముందు నిలచిన ‘గబ్బర్ సింగ్’ కూడా ఉందని చెప్పక తప్పదు. ఈ సినిమాకు ముందు హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ శ్రుతి హాసన్ ఫ్లాపుల పర్వంలో పయనిస్తున్నారు. ఇద్దరికీ అదిరిపోయే హిట్టును అందించింది ‘గబ్బర్ సింగ్’. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘దబంగ్’ మొదటి భాగం ఈ సినిమాకు ఆధారం. ‘షోలే’లోని విలన్ కేరెక్టర్ ‘గబ్బర్ సింగ్’పై అభిమానంతో ఈ రీమేక్ కు ఆ పేరు పెట్టారు. ఈ చిత్రం 2012 మే 11న జనం ముందు నిలచి, జయకేతనం ఎగరేసింది.
‘గబ్బర్ సింగ్’ కథలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు కనిపించవు. ఎందుకంటే, అంతకు ముందు వచ్చిన జగపతిబాబు ‘పెదబాబు’లోనూ ఓ కొడుకు, ఓ తల్లి, ఆమెకు రెండో భర్త, వారి పిల్లలు, వారితో ఈ పెద్దకొడుక్కి వచ్చే తలనొప్పి, తరువాత సుఖాంతం. అయితే ‘గబ్బర్ సింగ్’లో ఇదే లైను కనిపిస్తుంది. కానీ, కథానాయకుని తల్లిని ఇందులో విలన్ చంపేస్తాడు. అదే తేడా! కానీ, కథను వినోదభరితంగా నడిపించడంలో దర్శకుడు హరీశ్ శంకర్ సఫలీకృతుడయ్యారు. అంతేకాదు, మాతృక ‘దబంగ్’లో కంటే మిన్నగా ఇందులో హీరో, హీరోయిన్ మధ్య సాగే సన్నివేశాలు జనానికి వినోదం పంచుతాయి. అలాగే సవతి తండ్రి, అతని కొడుకుతో హీరోకు క్లాష్ కూడా సరదాగానే ఉంటుంది. ఇక పోలీస్ ఇన్ స్పెక్టర్ అయిన హీరో స్టేషన్ లో రౌడీలతో చేసే హంగామా కూడా భలే వినోదం అందిస్తుంది.
పవన్ కళ్యాణ్ కు ‘ఖుషి’ తరువాత దాదాపు ఏడేళ్ళకు ‘జల్సా’తో ఓ బ్లాక్ బస్టర్ దక్కింది. ఆ సినిమా అయ్యాక మళ్ళీ నాలుగేళ్ళకు ఈ ‘గబ్బర్ సింగ్’ బంపర్ హిట్ ను అందించింది. అంతకు ముందు శ్రుతి హాసన్ అంటేనే ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర ఉండేది. దానిని ఈ సినిమా విజయం చెరిపేసింది. ఆ తరువాత శ్రుతికి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కింది. అలా పవన్, శ్రుతికి ‘గబ్బర్ సింగ్’ ఘనవిజయం కలిసొచ్చింది. ఈ సినిమాకు ముందు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ , పవన్ కళ్యాణ్ తోనే నిర్మించిన ‘తీన్ మార్’ ఆకట్టుకోలేక పోయింది. అదీ రీమేకే! దాంతో ఈ రీమేక్ కూడా అంతగా అలరించదేమో అనుకున్నారు సినీజనం. కానీ, వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘గబ్బర్ సింగ్’ ఘనవిజయం సాధించింది.
దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, సాహితి, భాస్కరభట్ల రవికుమార్, దేవిశ్రీ ప్రసాద్ రాసిన పాటలు ఆకట్టుకున్నాయి. “దేఖో దేఖో గబ్బర్ సింగ్…”, “ఆకాశం అమ్మాయయితే నీలా ఉంటుందే…”, “పిల్లా నువ్వులేని జీవితం…”, “కెవ్వు కేక…”, “మందుబాబులం మేము …” వంటి పాటలు జనాన్ని భలేగా అలరించాయి. ‘గబ్బర్ సింగ్’ చిత్రం నిర్మాత బండ్ల గణేశ్ కు మంచి లాభాలు చూపింది. ఈ సినిమా మాతృక ‘దబంగ్’కు హిందీలో సీక్వెల్స్ వచ్చాయి. తెలుగులోనూ ‘గబ్బర్ సింగ్-2’ తీయాలని భావించారు. ఆ పై అదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా మొదలయింది. కానీ, కథలో ఎంతో తేడా ఉంది. అందువల్ల ‘సర్దార్ గబ్బర్ సింగ్’గా ఆ సినిమా జనం ముందు నిలచింది. అయితే ‘గబ్బర్ సింగ్’ స్థాయిలో అలరించలేక పోయింది.
ఇప్పటికీ ‘గబ్బర్ సింగ్’ సినిమా పేరు వింటే చాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఓ ఊపు కనిపిస్తుంది. ‘గబ్బర్ సింగ్’ తరువాత వచ్చిన పవన్ సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆకట్టుకోలేక పోయింది. ఆ పై వచ్చిన ‘అత్తారింటికి దారేది’ మళ్ళీ జనాన్ని విశేషంగా మురిపించింది. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ‘గబ్బర్ సింగ్’ స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో హీరో పవన్, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆ తరహా చిత్రానికి శ్రీకారం చుడతారేమో చూద్దాం.
