Site icon NTV Telugu

మూవీస్ రిలీజ్ జోష్ తగ్గలేదు!

గత నెలాఖరులో సినిమా థియేటర్లను తెరచిన దగ్గర నుండి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సినిమాల విడుదలకు అచ్చి వచ్చే సీజన్ ఎంత మాత్రం కాదు. అయినా… సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెద్ద సినిమాలు వస్తే… తమకు చోటు దక్కదనే భయంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలా జూలై చివరి వారం ఐదు సినిమాలు విడుదలైతే… ఈ నెల ప్రథమార్ధంలో ఏకంగా 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతవరకూ ‘తిమ్మరుసు, ఎస్.ఆర్. కళ్యాణ మండపం, పాగల్’ సినిమాలే కరోనా సెకండ్ వేవ్ తర్వాత కాస్తంత ప్రేక్షకాదరణ పొందాయి.

Read Also: రివ్యూ: రాజ రాజ చోర

ఈ వారాంతంలోనూ ఏకంగా ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. గురువారం శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’, శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’, సునీల్ ‘కనబడుటలేదు’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘రాజరాజచోర’కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక శుక్రవారం సంపూర్ణేశ్ బాబు ‘బజార్ రౌడీ’ వస్తోంది. దీనితో పాటే మరో రెండు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి బిగ్ బాస్ ఫేమ్ అర్చన నటించిన సోషియో ఫాంటసీ హారర్ మూవీ ‘అవలంబిక’. దీనిని రాజశేఖర్ దర్శకత్వంలో శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. మరొకటి ‘చేరువైనా దూరమైనా’. ఈ మూవీతో కమెడియన్ శ్రీనివాసరెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్నాడు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో సత్యనారాయణ, మహేశ్ గౌడ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు.

Read Also: రివ్యూ: కనబడుట లేదు

ఇవి కాకుండా ఈ నెలాఖరులో అంటే 27వ తేదీ ఇప్పటికే సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’తో పాటు సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రమూ విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాల మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అలానే శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించిన ‘హౌస్ అరెస్ట్’తో పాటు మరో రెండు మూడు సినిమాలు విడుదలయ్యే ఆస్కారం కనిపిస్తోంది. సో… ఓవర్ ఆల్ గా ఈ నెలలో దాదాపు ఇరవై ఐదు చిత్రాలు విడుదలయ్యే ఆస్కారం ఉంది. బాధాకరం ఏమంటే విడుదల సంఖ్యకు తగ్గట్టుగా విజయాల సంఖ్య మాత్రం ఉండటం లేదు. మరి సంక్రాంతి సీజన్ లో దక్కిన బ్లాక్ బస్టర్ హిట్స్ ను రాబోయే రోజుల్లో ఏ సినిమా పొందుతుందో చూడాలి.

Exit mobile version