Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

Film Federation Council (2)

Film Federation Council (2)

Film Federation Council: తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగతా 23 క్రాఫ్ట్స్‌కు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్, డాన్సర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న విభేదాలే ఈ అత్యవసర సమావేశానికి ప్రధాన కారణంగా మారాయి. ఇప్పటికే డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తున్న నేపథ్యంలో, నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా డాన్సర్స్ అసోసియేషన్‌లో జరిగిన ఉపఎన్నికల వ్యవహారంపై ఫెడరేషన్ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఫెడరేషన్ సూచనలు చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఉపఎన్నికలు నిర్వహించారని డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆమె వ్యవహార శైలిపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం ఇప్పుడు కేవలం డాన్సర్స్ అసోసియేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలు విభాగాల మధ్య చర్చకు దారితీసింది.

మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ వివాదం క్రమంగా జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్‌గా మారిందనే చర్చ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. అసోసియేషన్‌లోని అంతర్గత పరిణామాలు, ఎన్నికల వ్యవహారాలు, నాయకత్వ నిర్ణయాలు వంటి అంశాలు వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. నేటి జనరల్ కౌన్సిల్ సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫెడరేషన్ తీసుకోబోయే తదుపరి చర్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సహాయ నిరాకరణ కొనసాగించాలా, వివాదాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి, అసోసియేషన్ నాయకత్వంతో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారడంతో, ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో డాన్సర్స్ అసోసియేషన్‌తో పాటు మొత్తం సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.